ఇసుక విక్రయాల్లో పారదర్శకత
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: జిల్లాలో ఇసుక తవ్వకాలు, రవాణా, విక్రయాల్లో పూర్తి పారదర్శకతతో చర్యలు చేపట్టి ప్రజలకు ఇసుక సులభంగా అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ చాంబరులో ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇసుక తవ్వకాలు, రవాణా పర్యావరణానికి ఎటువంటి నష్టం కలగకుండా, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం మాత్రమే జరగాలన్నారు. ఆళ్లగడ్డ, ఆత్మకూరు, బనగానపల్లి, నందికొట్కూరు, నంద్యాల మండలాల్లో ఉన్న ఇసుక స్టాక్ పాయింట్ల సమీక్షించారు. ఆళ్లగడ్డ, నంద్యాల స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వలు లేకపోవడం, పలు ఫిర్యాదులు రావడం, రికార్డుల నిర్వహణలో లోపాలు ఉన్న కారణంగా వాటి రెన్యువల్‌కు అవకాశం లేదన్నారు. నంద్యాల స్టాక్ యార్డ్ డిపో హోల్డర్‌ను పిలిపించి విచారణ జరపాలని మైనింగ్ అధికారులకు సూచించారు. డోన్ పట్టణంలో కొత్త స్టాక్ యార్డు ఏర్పాటుకు టెండర్లను పిలవాలన్నారు. మైనింగ్ శాఖ అధికారులు చురుకుగా వ్యవహరించి, జిల్లాలో మైనింగ్ కార్యకలాపాలు సమర్థవంతంగా కొనసాగేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, జిల్లా మైనింగ్ అధికారి వేణుగోపాల్, కేసీ కెనాల్ ఈఈ ప్రతాప్, ఆర్టీఓ శివారెడ్డి, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, గ్రౌండ్ వాటర్ అధికారి రఘురాం తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


