జిల్లాలో వరి సాగు వివరాలు
వరి రైతులకు కలిసిరాని ఖరీఫ్
వరి రైతులకు మళ్లీ కన్నీళ్లే మిగిలాయి. గత ఏడాది ఖరీఫ్‌సీజన్‌లో చవి చూసిన నష్టాన్ని ఈ ఏడాది పూడ్చుకునేందుకు వరిసాగు చేస్తే తీవ్ర నిరాశే మిగిలింది. పంట చేతికి వచ్చిన సమయంలో భారీ వర్షాలు కురవడంతో దిగుబడులపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో వరుసగా రెండో ఏడాది కూడా రైతన్నలు నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది.
కోవెలకుంట్ల: జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో విస్తారంగా వరిసాగైంది. 29 మండలాల పరిధిలోని బోర్లు, బావులు, కుందూనది, పాలేరు, కుందర వాగు, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, తదితర నీటి ఆధారంగా 65,255 హెక్టార్లలో వరి సాగు సాధారణ విస్తీర్ణం. ఆయా మండలాల్లో లక్ష్యాన్ని మించి 73,038 హెక్టార్లలో కర్నూలు, నంద్యాల, షుగర్‌లెస్, 555 రకాలకు చెందిన వరిని సాగు చేశారు. ఇందులో బండి ఆత్మకూరు మండలంలో అత్యధికంగా 10,588 హెక్టార్లలో, రుద్రవరం మండలంలో 6,868, శిరివెళ్ల మండలంలో 6,215, నంద్యాల మండలంలో 5,602, గోస్పాడు మండలంలో 4,950, అవుకు మండలంలో 4,447, పాణ్యం మండలంలో 4,320, వెలుగోడు మండలంలో 4,234 బనగానపల్లె మండలంలో 3,676, మహానంది మండలంలో 3,444 హెక్టార్లలో వరి సాగైంది. పైరు వివిధ దశలతోపాటు గత నెలలో కురిసిన భారీ వర్షాలు, మోంథా తుపాన్ రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి.
పెరిగిన పెట్టుబడులు..
తగ్గిన దిగుబడులు
ఈ ఏడాది జిల్లాలో వరి సాగులో పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. గతేడాది నష్టాన్ని పూడ్చుకునేందుకు రైతులు కర్నూలు, నంద్యాల సోనా రకాలకు చెందిన వరిని అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. నార, నాట్లు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపునివారణ, వరి కోత, నూర్పిడితో కలిపి ఎకరాకు రూ. 35 వేలకు పైగా వెచ్చించారు. అక్టోబర్ నెలలో పైరు పొట్ట దశకు చేరుకుంది. ఆ నెలలో భారీ వర్షాలకు తోడు మోంథా తుపాన్ ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. దీంతో పంట నేలవాలి వడ్లు రాలిపోయాయి. పొట్టదశ కావడంతో గింజతాలిపోయింది. ఎకరాకు 40 బస్తాలకు పైగా దిగబడులు వస్తాయనుకుంటే భారీ వర్షాలు దెబ్బతీయడంతో 30 బస్తాలకు మించి దిగుబడులు రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వరి నేలవాలడంతో కోత, నూర్పిడి ఆలస్యమవుతుంది. యంత్రాలకు బాడుగ రూపంలో అదనపు భారం పడుతోందని రైతులు వాపోతున్నారు. ఓ వైపు దిగుబడులు తగ్గగా మరోవైపు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో క్వింటా 2,200 వరకు ధర పలికింది. ప్రస్తుత మార్కెట్‌లో బస్తా రూ. 1,400 మించి లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ ధరకు విక్రయిస్తే కనీసం పెట్టుబడులు కూడా రావని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం వరికి గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.
నియోజకవర్గం సాధారణ సాగు విస్తీర్ణం
విస్తీర్ణం (హెక్టార్లలో)
శ్రీశైలం 19,126 20,849
ఆళ్లగడ్డ 17,512 19,210
బనగానపల్లె 11,021 12,194
నంద్యాల 8,898 10,552
నందికొట్కూరు 3,068 4,158
డోన్ 427 255
పాణ్యం,
గడివేముల 5,203 5,820
జిల్లాలో 73 వేల హెక్టార్లలో
సాగైన వరి
ఎకరాకు రూ. 35 వేలు పెట్టుబడి
దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపిన
భారీ వర్షాలు
గతేడాదీ ఇదే పరిస్థితి
మార్కెట్‌లో మద్దతు ధర
అంతంత మాత్రమే
నష్టాల ఊబిలో అన్నదాతలు


