డెయిరీని అభివృద్ధి చేయడమే తప్పా
యూనియన్ ఆస్తుల్లో ఒక్క సెంటు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నట్లు నిరూపించు
కర్నూలు(అగ్రికల్చర్): ‘‘నేను చైర్మన్ అయ్యే నాటికి డెయిరీ రూ.50లక్షల లాభాల్లో మాత్రమే. ఆ తర్వాత ఏడాదికి రూ.15కోట్ల లాభాలను తీసుకొచ్చాం. పాల ఉత్పత్తిదారులకు రూ.18 కోట్లు, ఉద్యోగులకు రూ.3 కోట్ల ప్రకారం రూ.21 కోట్లు బోనస్‌లు ఇచ్చాం. టర్నోవర్ రూ.180 కోట్ల నుంచి రూ.360 కోట్లకు తీసుకెళ్లాం. డెయిరీని అభివృద్ధి చేయడమే నేను చేసిన తప్పా..’’ అని కర్నూలు మిల్క్ యూనియన్ చైర్మన్ ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియను ప్రశ్నించారు. శనివారం ఆయన కర్నూలులోని విజయ డెయిరీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తాను చైర్మన్ అయ్యాక అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చామని, ఒక్కరి నుంచైన డబ్బు తీసుకున్నట్లు చేతనైతే నిరూపించాలన్నారు. కర్నూలు మిల్క్ యూనియన్(విజయ డెయిరీ) ఆస్తుల్లో ఒక్క సెంటు భూమి/స్థలాన్ని ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు నిరూపిస్తే తన యావదాస్తి భూమా అఖిలప్రియ కుటుంబానికి స్వాధీనం చేస్తానన్నారు. మంత్రి లోకేష్‌కు తప్పుడు ఫిర్యాదులు చేసి.. శాసనసభలో తనపైన, డెయిరీపైనా అసత్యాలు చెప్పి పరువు పోగొట్టుకున్నారన్నారు. 2015లో జగత్ డెయిరీని ఏర్పాటు చేసి నడుపలేక 2020లోనే మూతవేశారన్నారు. అలాంటి మీరు కర్నూలు మిల్క్ యూనియన్‌ను ఎలా నడుపుతారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే తమ్ముడు జగత్ విఖ్యాత్‌రెడ్డి చైర్మన్ పదవికే అనర్హుడని ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆయన, ఎమ్మెల్యే కర్నూలు మిల్క్ యూనియన్‌కు రూ.1.30 కోట్ల బకాయి పడ్డారని, 2020 నుంచి ఈ బకాయి ఎంత మొత్తానికి చేరుకొని ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని నేరాలు, ఘోరాలు, అవినీతి మయం చేశారని.. దొంగే దొంగ.. దొంగ అన్నట్లుగా అఖిలప్రియ పరిస్థితి ఉందన్నారు. నా మీద ఇప్పటికే పలు కేసులు పెట్టించారని.. కానీ ఉద్యోగులను కేసుల పేరిట వేధించడం మంచిది కాదన్నారు. మీ స్వార్థం కోసం డెయిరీని దెబ్బతీయవద్దని హితవు చెప్పారు. డెయిరీలో అక్రమాలు జరుగుతున్నాయని ఫెడరేషన్ ద్వారా ఆరు నెలల నుంచి విచారణ జరుపుతున్నా ఒక్కటీ నిరూపించలేకపోయారన్నారు. ఇంకా ఎన్ని దర్యాప్తులకై నా తాను సిద్ధమేనని సవాల్ విసిరారు.
యావదాస్తి మీకు స్వాధీనం చేస్తా
లేదంటే ఎమ్మెల్యే పదవికి
రాజీనామా చేస్తావా?
ముందు డెయిరీకి బకాయి పడిన
రూ.1.30 కోట్లు చెల్లించండి
ఎమ్మెల్యే అఖిలప్రియపై
కర్నూలు మిల్క్ యూనియన్ చైర్మన్
ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం


