ఎత్తిపోతలను గాలికొదిలేశారు
● ఎమ్మెల్యే, ఎంపీకి రైతు సమస్యలు పట్టవా? ● వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ దారా సుధీర్
నందికొట్కూరు: ఎత్తిపోతల పథకాలను పాలకులు గాలికొదిలేశారని వైఎస్సార్‌సీపీ నందికొట్కూరు నియోజకరవ్గ ఇన్‌చార్జ్ దారా సుధీర్ విమర్శించారు. మంగళవారం ఆయన రైతులు, పార్టీ నేతలతో కలసి నాగటూరు ఫేస్–1, ఫేస్–2 మద్దూరు సుబ్బారెడ్డి ఎత్తిపోతల పథకాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎత్తిపోతల పథకాలకు చెందిన ట్రాన్స్‌ఫార్మర్లను దొంగలు అపహరించినా అధికారులు ఇంత వరకు చర్యలు తీసుకోలేదన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతులకు గురైతే ఎమ్మెల్యే జయసూర్య, ఎంపీ శబరి, అధికారులు ఏమి చేస్తున్నారని ఆయన నిలదీశారు. నాగటూరు లిఫ్ట్ ఇరిగేషన్ కింద 15 వేల ఎకరాలకు సాగునీరు అందక ఖరీఫ్ సీజన్‌లో పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రబీ సీజన్ ప్రారంభమైన లిఫ్ట్ ఇరిగేషన్ ట్రాన్స్‌ఫార్మర్స్ మరమ్మతులకు నోచుకోకపోవడంతో సాగునీరు అందని పరిస్థితి నెలకొందన్నారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో ఎత్తిపోతల పథకాలకు ఎలాంటి మరమ్మతులు వచ్చినా పార్టీ రాష్ట్ర యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రత్యేక చొరవతో వెంటనే చేయించి రైతులకు సాగునీరు అందించారన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ జగదీశ్వర్‌రెడ్డి, సర్పంచు జనార్దన్‌గౌడ్, పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, కార్యదర్శి మద్దిలేటిరెడ్డి, పట్టణ అధ్యక్షులు మన్సూర్, నాయకులు పుల్యాల నాగిరెడ్డి, శివరామకృష్ణారెడ్డి, తిరుమలేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, నాగశేనారెడ్డి, సుధాకర్‌రెడ్డి, రమణ, శ్రీరాములు, ప్రశాంత్‌రెడ్డి, మధురెడ్డి, మోహన్‌రెడ్డి, నారాయణ, నరేష్ పాల్గొన్నారు.


