ఏసీబీ వలలో డిప్యూటీ తహసీల్దార్
● రూ. 35 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
డోన్ టౌన్: చుక్కల భూమిని పట్టాగా మార్చేందుకు డోన్ డిప్యూటీ తహసీల్దార్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల మేరకు..వెల్దుర్తి మండలం గుంటుపల్లె గ్రామానికి చెందిన రైతు దామ వేణుగోపాల్‌కు డోన్ మండలం జగదుర్తి గ్రామ సమీపంలో 20–1,20–బీ2, 27–బీ2 సర్వే నంబర్లలో పొలం ఉంది. అయితే చుక్కల భూమిగా ఉండటంతో పట్టా భూమిగా మార్చాలని డోన్ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగాడు. అయితే ఇందుకు డిప్యూటీ తహసీల్దార్‌గా పని చేస్తున్న సునీల్‌రాజా రూ. 35 వేలు డిమాండ్ చేశారు. దీంతో రైతు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు రైతు నుంచి మంగళవారం డీటీ సునీల్ రాజా లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సోమన్న, సీఐలు కృష్ణయ్య, రాజ ప్రభాకర్, శ్రీనివాసులతో కలిసి దాడి చేసి రెడ్ హ్యాండెండ్ పట్టుకున్నారు. వెంటనే పంచనామా పూర్తి చేశారు. రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తుదుపరి విచారణ చేపడుతామని డీఎస్పీ తెలిపారు.


