ప్రతి కుటుంబం మరుగుదొడ్డిని ఉపయోగించాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
గోస్పాడు: జిల్లాలో ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మించుకుని ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ చాంబర్‌లో బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలు, పారిశుద్ధ్యంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగంపై సర్వే చేయించి వాటి వినియోగానికి చర్యలు తీసుకునేలా ఈఓఆర్‌డీలు, ఎంపీడీఓలకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో ట్యాంకుల పరిశుభ్రత, క్లోరినేట్ చేసిన తాగునీటి సరఫరా, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలపై సమీక్షించి ఎప్పటికప్పుడు పీఆర్‌వన్ యాప్‌లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్తాచెదారాలను తొలగించడంతోపాటు గ్రామాల్లో ఉన్న చెత్తకుప్పలను పరిశుభ్రం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగత ఇంకుడు గుంతలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆవరణలో కమ్యూని టీ ఇంకుడు గుంతలతో పాటు కమ్యూనిటీ శాని టరీ కాంప్లెక్స్‌ల వివరాలు సేకరించడంతో పాటు వాటిని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నెల మూడో శనివారం చేపట్టే స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి పరిశుభ్రత కార్యక్రమాలపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి డీపీఓ శివారెడ్డి, డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
16 మంది డిబార్
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిఽధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 59 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్న పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన సెమిస్టర్ పరీక్షలకు 1,181 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 10,775 మందికి 9,616 మంది హాజరు కాగా 1,159 మంది గైర్హాజరయ్యారని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. 6వ సెమిస్టర్ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలకు 207 మందికి 185 మంది హాజరు కాగా 22 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. చూచిరాతలకు పాల్పడిన 16 మంది విద్యార్థులను గుర్తించి డిబార్ చేసినట్లు పేర్కొన్నారు.


