రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
జూపాడుబంగ్లా: రుణాలను సద్వినియోగం చేసుకొని రైతులు ఆర్థికాభివృద్ధి చెందాలని సెర్ప్ అడిషనల్ సీఈఓ శ్రీరాములునాయుడు అన్నారు. సోమవారం మండలకేంద్రమైన జూపాడుబంగ్లా వెలుగు కార్యాలయంలో ఎఫ్‌పీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎఫ్‌పీఓ సంఘాలు వ్యవసాయాధి అధికారుల నుంచి ఆధునిక వ్యవసాయ పద్ధతులు, రాయితీ విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్రపరికరాల వివరాలు తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎఫ్‌పీఓ సంఘాల్లో రుణాలు తీసుకొని రైతులు వాటిని జీవనోపాధుల కోసం వినియోగించుకోవాలన్నారు. తద్వారా ఏడాదిలో మూడు, నాలుగు రకాల జీవనోపాధులు కల్పించుకోవటం ద్వారా ఆదాయ వనరులు మెరుగుపర్చుకోవాలని సూచించారు. రైతులకు మంచిచేయాలనే వారిని మాత్రమే బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా నియమించాలని ఏపీఎం, సీసీలను ఆదేశించారు. జూపాడుబంగ్లాలోని ఎఫ్‌పీఓ సంఘాల్లో ఆశించిన ఫలితాల్లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు.
65 లక్షల నిధులు ఏమైనట్లు
మూడేళ్ల క్రితం జూపాడుబంగ్లా వెలుగు కార్యాలయానికి మంజూరు చేసిన రూ.కోటి సీఐఎఫ్ నిధుల్లో రూ.65 లక్షల నిధులు ఏమయ్యాయని సెర్ప్ అదనపు సీఈఓ శ్రీరాములునాయుడు ఏపీఎం అంబమ్మ, సీసీలను ప్రశ్నించారు. పొదుపు సంఘాల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని ఏపీఎం అంబమ్మ తెలుపగా రుణాల రికవరీ పెండింగ్ ఉంటే మహా అయితే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలుంటుంది.. కానీ రూ.65 లక్షలు పెండింగ్‌లో ఉన్నా యంటే.. ఏమి చేస్తున్నారని అడిషనల్ సీఈఓ ప్రశ్నించారు. పక్షం రోజుల్లోగా రూ.65 లక్షలు ఏమయ్యాయనే విషయమై లెక్కలు చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి, సెర్ప్ స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీరాములు, ఎఫ్‌పీఓ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, సీసీలు, వీఓఏలు, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.


