ఏసీబీ వలలో సీనియర్ అసిస్టెంట్
● రిటైర్డ్ మున్సిపల్ ఉద్యోగి నుంచి
రూ. 35 వేల లంచం డిమాండ్
డోన్ టౌన్: ఒక రిటైర్డు మున్సిపల్ ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ డోన్ సబ్ ట్రెజరీ సీనియర్ అసిస్టెంట్ లక్ష్మానాయక్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కర్నూలు ఏసీబీ డీఎస్పీ డి.సోమన్న తెలిపిన వివరాల మేరకు.. ఈ ఏడాది జూన్ 30వ తేదీన మున్సిపాల్టీలో రెవెన్యూ ఉద్యోగి సామరాజు ఉద్యోగ విరమణ పొందారు. రిటైర్డ్ బెనిఫిట్స్ కింద ప్రభు త్వం నుంచి రూ.33 లక్షలు రావాల్సి ఉంది. వాటి కోసం నాలుగు నెలులుగా డోన్ సబ్ ట్రెజరీ కార్యా లయం చుట్టూ తిరగుతున్నారు. అయితే ఈ డబ్బులు మంజూరు చేయడానికి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ లక్ష్మానాయక్ రూ.40 వేలు డిమాండ్ చేశారు. ఇందుకు రూ.35 వేలు ఇస్తానని సామరాజు ఒప్పుకుని విషయం కర్నూలు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు ఇచ్చిన సూచన ప్రకారం ఆయన సోమవారం ట్రెజరీకి వచ్చి లక్ష్మానాయక్‌ను కలిశారు. డబ్బులు చేతికి ఇవ్వకుండా కార్యాలయం ఎదుట ఉన్న చెట్టు తొర్ర వద్ద ఉంచాలని సూచించడంతో.. ఆ మేరకు అక్కడ రూ. 30 వేలు ఉంచి తిరిగి కార్యాలయంలోకి వెళ్లాడు. దూరం నుంచి మొత్తం గమనిస్తున్న ఏసీబీ అధికారులు కార్యాలయంలో సీని యర్ అసిస్టెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు. చెట్టు తొర్ర వద్ద ఉంచిన నగదను స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు లక్ష్మానాయక్‌పై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సోమన్న తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు కృష్ణయ్య, రాజా ప్రభాకర్, శ్రీనివాసులుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
40 రోజుల్లో ఇద్దరు..
ఈ ఏడాది నవంబరు 11వ తేదీన స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐ సునీల్ రాజా ఒక రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం విధితమే. తహసీల్దార్ కార్యాలయం, సబ్ ట్రెజరీ కార్యాలయం ఒకే ప్రహరీలో ఉన్నాయి. సోమ వారం సీనియర్ అసిస్టెంట్ దొరికిపోవడంతో రెవె న్యూశాఖ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 40 రోజుల్లో మండలంలో ఇద్దరు అధికారులు ఏసీబీకి పట్టుబడటంతో తీవ్ర చర్చ జరుగుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత డోన్ ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరిగి పోయందని ప్రజలు విమర్శిస్తున్నారు.
పోలీసు పీజీఆర్‌ఎస్‌కు 94 అర్జీలు
నంద్యాల(అర్బన్): పోలీసు పీజీఆర్‌ఎస్‌కు 94 అర్జీలు వచ్చాయని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి ఎస్పీ వినతులు స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ చేసి పరిష్కారానికి చొరవ చూపాలని పోలీసు అధికారులను ఆదేశించారు. చట్ట పరిధిలో ఉన్న అర్జీలను తక్షణమే పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు.
ఏసీబీ వలలో సీనియర్ అసిస్టెంట్


