తెలుగు తమ్ముడా మజాకా!
జూపాడుబంగ్లా: పారుమంచాల గ్రామానికి చెందిన ఓ తెలుగు తమ్ముడు 3.95 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు పొలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నా పట్టించుకునే నాఽథుడే కరువయ్యాడు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఖలీముల్లాకు సర్వే నంబర్ 275లో 1.59 ఎకరాల పొలం ఉంది. అందులో రోడ్డు పోను 0.40 సెంట్ల పొలం మిగిలి ఉంది. రోడ్డులో పోయిన తన పొలానికి ప్రత్యామ్నాయంగా పక్కన్నే ఉన్న సర్వే నంబర్ 278 లోని 3.95 ఎకరాల పొలం తనకు కేటాయించాలని ఇటీవల పీజీఆర్‌ఎస్‌లో వినతి పత్రం ఇచ్చాడు. ఈ మేరకు ఈనెల 4వ తేదీన పొలాన్ని తహసీల్దార్ పరిశీలించారు. అనంతరం రెవెన్యూ రికార్డులను చూడగా ఆ పొలం ప్రభుత్వ పోరంబోకు స్థలం కావడంతో ఎవ్వరికీ కేటాయించటం కానీ, ఆన్‌లైన్‌లో ఎక్కించటం నేరమవుతుందని తేల్చి చెప్పారు. ఎవ్వరైనా ఆక్రమించినా చట్టపరంగా చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. అలాగే గ్రామపంచాయతీ తీర్మానం మేరకు ఆ భూమిని రజకుల దోబీఘాట్లకు కేటాయించినట్లు తెలి పారు. అయితే 20 రోజులు గడవకముందే ఖలీముల్లా సోమవారం జేసీబీలు, డోజర్ల సహాయంతో ఆ భూమిలో కంపచెట్లు తొలగించి చదును చేసి ఆక్రమించేశాడు. ఈ విషయాన్ని గ్రామసర్పంచ్ కుమారుడు దేవసహాయం తహసీల్దార్ చంద్రశేఖర్‌నాయక్‌కు ఫోన్ లో సమాచారం ఇవ్వగా.. తనకెవ్వరూ లిఖితపూర్వ కంగా ఫిర్యాదు చేయలేదని తహసీల్దార్ చెప్పేశారు. దీంతో వెంటనే దేవసహాయం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని ప్రజాసమస్యల పరిష్కార వేదికలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అప్పుడు స్పందించిన తహసీల్దార్ పారుమంచాల వీఆర్‌ఏకు ఫోన్‌చేసి 278 సర్వే నంబర్‌లో ఆక్రమణలను నిలిపివేయాలని ఆదేశించారు. అయితే అప్పటికే పొలంలోని కంపచెట్లను తొలగింపజేయటంతో పాటు పంట సాగుకు అనుకూలంగా మార్చేశారు. టీడీపీ నాయకుడు దర్జాగా పోరంబోకు స్థలాన్ని కబ్జా చేసినా అడ్డుకునేందుకు అధికారులు వెనుకడుగు వేయడం పట్ల గ్రామస్తులు విమర్శలు చేస్తున్నారు.
3.95 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు
భూమి దర్జాగా ఆక్రమణ
యంత్రాలతో కంప చెట్లు తొలగించి
పొలం చదును చేసిన వైనం
అధికారులకు తెలిసినా
చర్యలకు వెనకడుగు
తెలుగు తమ్ముడా మజాకా!


