
ఉరిమిన వర్షం.. పిడుగులా నష్టం
● కల్లాల్లో ధాన్యం తడిచిన వైనం
● నేలవాలిన బొప్పాయి,
మామిడి వృక్షాలు
● పిడుగుపాటుతో ముగ్గురు మృతి
కర్నూలు(అగ్రికల్చర్): ఉరుములు, మెరుపులు, పిడుగులు, భారీ గాలులతో ఉన్నట్టుండి ఆదివారం మధ్యాహ్నం కురిసిన వర్షం రైతులను నిలువునా ముంచింది. అన్నదాతలకు తీవ్ర నష్టం మిగిల్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఐదు చోట్ల పిడుగుపాటు సంఘటనలు చోటు చేసుకోగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మూగజీవులు సైతం మృత్యువాత పడ్డాయి. అకాల వర్షంతో కల్లాల్లో ఉన్న వరి ధాన్యం తడిచి పోయింది, పెనుగాలుల తీవ్రతకు అరటి, బొప్పాయి, మామిడి వంటి పంటలకు భారీ నష్టం వాటిల్లింది.
నష్టం ఇలా..
● బనగానపల్లె మండలంలో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలవాలింది. అకాల వర్షం తమను నిండా ముంచిందని రైతులు అవేదన వ్యక్తం చేశారు. పసుపల పరిసర ప్రాంతాల్లో కల్లాల్లోని మొక్కజొన్న తడిచిపోయింది.
● కొలిమిగుండ్ల మండలంలో కొద్ది రోజుల్లో అరటి గెలలను కోయాల్సిన తరుణంలో ఆకాల వర్షం దెబ్బతీసింది. మిరప కోత కోసి ఆరబెట్టుకోగా పూర్తిగా తడిచి పోయింది.
● సంజామల మండలంలో రబీలో వేసిన మొక్కజొ న్న, మిరప, వరి తదితర పంటలు నూర్పిడి దశలో ఉన్నాయి. అకాల వర్షంతో పంట తడిచిపోయింది.
● బేతంచెర్ల మండలంలో గాలివానకు మామిడి కాయలు రాలిపోవడంతో రైతులు నష్టపోయారు.
● పాణ్యం మండలంలో అరటి, మిరప రైతులు తీవ్రంగా నష్టపోయారు.
● బండి ఆత్మకూరు మండలంలో వరి పైరు నేలవాలడంతో గింజలు రాలిపోయాయి. దీంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు.
● కోవెలకుంట్ల మండలంలోని గుళ్లదూర్తి, కలుగొట్ల, రేవనూరు, లింగాల, వల్లంపాడు, చిన్నకొప్పెర్ల, తదితర గ్రామాల రైతులు వడ్లు, మిరప, మొక్కజొన్న దిగుబడులను కల్లాలు, పొలాల్లో ఆరబోసుకున్నారు. భారీ వర్షం కావడంతో పట్టలు కప్పినా నీరు కిందకు చేరి దిగుబడులు తడిచిపోయాయి.
విషాదం
కౌతాళం మండలం కాత్రికి గ్రామంలో పిడుగు పడి యువకులు అశోక్(21), బాలయ్య (22) మృతి చెందారు. అలాగే నిరుపాధి, గంగాధర్ తీవ్రంగా గాయపడ్డారు. క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా గాలీవాన మొదలై వర్షం ఎక్కువ కావడంతో సమీపంలోని చెట్టు కిందకు చేరుకోవడంతో పిడుగు పడి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
● కృష్ణగిరి మండలం కటారుకొండ గ్రామంలో పొలానికి వెల్లిన బోయ శ్రీనివాసులు అనే రైతు పిడుగుపాటు పడి మృతి చెందారు.