వైభవంగా వసంతోత్సవం
బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలో శ్రీ చౌడేశ్వరి దేవి రాయబారాది జ్యోతి మహోత్సవాలు వసంతోత్సవంతో శనివారం ముగిశాయి. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ.. ఉదయం శ్రీ చౌడేశ్వరిదేవి, శ్రీ చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి సమీపంలో ఉన్న కోనేరు వరకు వసంతోత్సవం నిర్వహిస్తూ తీసుకెళ్లారు. అనంతరం కోనేరులోని నీటితో విగ్రహాలను శుభ్రం చేసి మళ్లీ ఆలయానికి తీసుకొచ్చారు. భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ముగిసిన ఇంటర్ మూల్యాంకనం
● ఈ నెల 12న ఫలితాలు వెలువడే
అవకాశం?
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం శనివారం ముగిసింది. మార్చి 7న ప్రారంభమైన ఈ ప్రక్రియ మొత్తం 29 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగింది. ప్రతి స్పాట్ కేంద్రానికి స్కానర్‌ను అందజేయడంతో మార్కుల నమోదు చేపట్టారు. దీంతో ఇంటర్ ఫలితాలు ఈ నెల 12న వచ్చే అవకాశముందని అధ్యాపకులు బెబుతున్నారు. వివిధ జిల్లాల నుంచి నంద్యాలకు చేరుకున్న 2,01,598 జవాబు పత్రాలను 432 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకనం చేశారు. పూర్తి పారదర్శకంగా నిర్దేశించిన సమయానికి మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేసినట్లు డీఐఈఓ సునీత తెలిపారు.
కుంగిన జాతీయ రహదారి
డోన్: పట్టణ శివారులోని యు. కొత్తపల్లె క్రాస్ రోడ్డు వద్ద నూతనంగా నిర్మిస్తున్న 340బీ నేషనల్ హైవే ఒక వైపు కుంగిపోయింది. రాత్రివేళల్లో గమనించకుండా వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురై ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగి ఉండేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డోన్ నుంచి బేతంచెర్ల మీదుగా తమ్మరాజుపల్లె వరకు 38 కిలోమీటర్ల పొడవు గల రహదారిని నిర్మించేందుకు రూ.650 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. పనులు నాసిరకంగా జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల వేసిన ఈ రోడ్డు కుంగిపోవడంపై ఎన్‌హెచ్ అధికారులను స్థానికులు అప్రమత్తం చేశారు.
మద్దిలేటయ్య క్షేత్రంలో భక్తుల రద్దీ
బేతంచెర్ల: శ్రీ మద్దిలేటి నరసింహస్వామి క్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ కనిపించింది. చైత్ర మాసం కావడంతో నంద్యాల, కర్నూలు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లకు దర్శించుకున్నారు. పంచామృతాభిషేకం, కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించారు. స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజ చేయడంతోపాటు మహా మంగళహారతి ఇచ్చారు.
దాతలు సహకరించాలి
శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో గదులు నిర్మించిన దాతలు భక్తుల రద్దీ దృష్ట్యా సహకరించాలని ఆలయ ఉపకమిషనర్, ఈఓ రామాంజనేయులు శనివారం తెలిపారు. గతంలో దాతలకు ఏడాదిలో ఐదుసార్లు ఉచితంగా గదులను ఇచ్చేవారమన్నారు. ప్రస్తుతం పెరిగిన భక్తుల రద్దీ దృష్ట్యా పాసులను నెల ముందు పంపాలని సూచించారు. ఒక్కసారి పాసు వాడిన తరువాత మరొక పాసుకు వ్యవధి 10 వారాలు ఉండాలన్నారు.
రగ్బీ పోటీల్లో ప్రతిభ చాటండి
కర్నూలు (టౌన్) : అనంతపురం పోలీసు ట్రైనింగ్ కళాశాల క్రీడా మైదానంలో ఈనెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో ప్రతిభ చాటాలని రగ్బీ అసోసియేషన్ కార్యదర్శి రామాంజనేయులు పిలుపు నిచ్చారు. శనివారం స్థానిక బి. క్యాంపు క్రీడా మైదానంలో జిల్లా స్థాయి జట్లకు క్రీడాకారుల ఎంపిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒలింపిక్ క్రీడగా గుర్తింపు పొందిన రగ్బీలో రాణిస్తే భవిష్యత్తులో విద్యా, ఉద్యోగ అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు.
వైభవంగా వసంతోత్సవం
వైభవంగా వసంతోత్సవం


