వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడి
జూపాడుబంగ్లా: టీడీపీ నాయకుల దాడిలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి, పి.లింగాపురం సర్పంచ్ నాగార్జునరెడ్డి, అతని తండ్రి, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని లింగాపురంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాలు.. 80బన్నూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 769ఐ, 769జే లలో ఉన్న 21.50 ఎకరాల పొలాన్ని మంగళవారం అధికారులు సర్వే చేసేందుకు ఉపక్రమించారు. నాగార్జునరెడ్డి అతని తండ్రి రాజ్‌కుమార్‌రెడ్డి, చిన్నాన్న తిరుమలేశ్వరరెడ్డి, పి.లింగాపురం గ్రామానికి చెందిన కొంత మంది గ్రామస్తులు అక్కడికి చేరుకుని పొలం తమ పూర్వీకులని, సర్వే నిలిపివేయాలని కోరారు. విషయం తెలుసుకున్న జూపాడుబంగ్లాకు చెందిన టీడీపీ నాయకుడు జంగాల పెద్దన్న, అతని కుమారుడు మోతె వెంకటయ్య, సోదరుడు శేఖర్, మరికొంత మంది పొలం వద్దకు చేరుకుని 17 ఏళ్లుగా పొలాన్ని తాము సాగుచేసుకుంటూ ఉన్నామని, ఇప్పుడొచ్చి పొలం తమదంటే ఎలాగంటూ నాగార్జునరెడ్డిని నిలదీశారు. ఈక్రమంలో మాటామాటా పెరగడంతో టీడీపీ నాయకులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నాగార్జునరెడ్డి, రాజ్‌కుమార్‌రెడ్డి, తిరుమలేశ్వరరెడ్డి, రవి తలలకు రక్త గాయాలయ్యాయి. బాధితులు పోలీసుస్టేషన్‌కు చేరుకోవటంతో పోలీసులు వారిని చికిత్సనిమిత్తం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈసందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ జంగాల పెద్దన్న, మోతె వెంకటయ్య, జంగాల శేఖర్, శంకరయ్య, వెంకటమ్మ మరికొంత మంది కర్రలు, కొడవళ్లు, కత్తులతో తమపై దాడిచేరన్నారు. కాగా వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడిచేసిన టీడీపీ నాయకులు కూడా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయటం గమనార్హం.
పొలం విషయంలో ఘర్షణ
నలుగురికి రక్త గాయాలు
వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడి


