బేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 39.66 లక్షలు వచ్చింది. స్వామి, అమ్మవార్లకు భక్తులు సమర్పించిన కానుకలు, ముడుపుల హుండీ లెక్కింపు మంగళవారం దేవదాయశాఖ అధికారి జనార్దన, ఆలయ ఈఓ రామాంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. 58 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు ద్వారా ఆలయానికి రూ. 39,66,066 నగదు, 47 గ్రాముల బంగారు, 1.300 కిలోల వెండి వచ్చింది. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ రామ్ మోహన్ రావు, మహిళా భక్తులు, వేదపండితులు, అర్చకులు పాల్గొన్నారు.
30 నుంచి చౌడేశ్వరిదేవి జ్యోతి ఉత్సవాలు
బనగానపల్లె: నందవరంలో వెలసిన చౌడేశ్వరిదేవి అమ్మవారు జ్యోతి మహోత్సవాలు ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు ఏప్రిల్ 5వ తేదీ వరకు అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 30వ తేదీ సాయంత్రం ఉత్సవాలకు అంకురార్పణ, పంచాంగ శ్రవనం, పన్నేరపు బండ్లు తిప్పుట, ప్రాకార రథోత్సవం, 31న శ్రీదేవి భూదేవి సమేత చేన్నకేశవస్వామి కల్యాణోత్సవం, ఏప్రిల్ 1న ఉదయం అమ్మవారికి కుంకుమార్చన, సాయంత్రం అమ్మవారి రాయబార మహోత్సవం, 2న అభయహస్త సేవా సమితి ధర్మవరం వారిచే అన్నమయ్య సంకీర్తన చౌడేశ్వరిదేవి జ్యోతి మహోత్సవం, అర్ధరాత్రి నుంచి భాస్కరయ్య ఆచారిచే అమ్మవారికి దిష్టి చుక్క పెట్టుట, 3న సాయంత్రం రథోత్సవం, 4న తిరుగు రథోత్సవం, 5న వసంతోత్సవం నిర్వహించనున్నారు. ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని, ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఆలయ ఉప కమిషనర్ కామేశ్వరమ్మ మంగళవారం తెలిపారు.
తెల్లవారుజాము నుంచే మహానందీశ్వరుడి దర్శనం
మహానంది: ఉగాది ఉత్సవాల సందర్భంగా మహానందీశ్వరుడి దర్శనానికి వచ్చే కన్నడ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచే దర్శనం కల్పిస్తున్నట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ ఆలయ తలుపులు తెల్లవారుజామున 3.30 గంటలకే తెరిచి స్వామి వారికి అభిషేకం, పూజల అనంతరం 4.10 గంటలకు హారతులు ప్రారంభించి 4.30 గంటల నుంచి భక్తులకు ద ర్శనం కల్పిస్తామన్నారు. అర్చకులతో పాటు ప్రధాన కౌంటర్ల సిబ్బంది అందరూ నిర్ణీత సమయానికి హాజరు కావాలని ఆదేశించారు.
ఏప్రిల్ 1 వరకు ఎండుమిర్చి, వాము క్రయవిక్రయాలు బంద్
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 1 వరకు ఎండుమిర్చి, వాము క్రయవిక్రయాలు నిలిపివేస్తున్నట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున అకౌంట్స్‌ను క్లోజ్ చేసుకోవాల్సి ఉందని.. వాము, ఎండుమిర్చి క్రయవిక్రయాలు చేపట్టలేమని వ్యాపారస్తుల అసోషియేషన్ చెప్పినందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని, కమీషన్ ఏజెంట్లు కూడా ఆయా సరుకులను తెప్పించరాదని సూచించారు.
శ్రీమద్దిలేటయ్య హుండీ ఆదాయం రూ.39.66 లక్షలు


