ఉయ్యాలవాడ: జిల్లాలో ముస్లింలకు సంబంధించిన ఈద్గా, మసీదులు, శ్మశాన వాటికల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారిణి సబిహా పర్వీన్ అన్నారు. శనివారం మండల కేంద్రమైన ఉయ్యాలవాడలో ఆమె పర్యటించారు. పరిశుభ్రత పనులను పరిశీలించా రు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని శుభ్రతలో ఆదర్శంగా తీర్చిదిద్దాలని తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు, ఈఓపీఆర్‌డీ వెంకటేశ్వరరావును ఆదేశించారు. అనంతరం గ్రామంలో మైనార్టీల సమస్యలపై ఆరా తీశారు. ఈద్గాకు ప్రహరీలేదని, అలాగే రంజాన్, బక్రీద్ పండుగల సమయంలో నమాజ్‌కు అక్కడికి వెళ్లేందుకు గ్రామం నుంచి రహదారి సౌకర్యం లేదని మండల కోఆప్షన్ మెంబర్ అమీర్ అహమ్మద్, మత పెద్దలు రెడ్డిపల్లె బాషా, హుసేనయ్య, చిన్న మౌలా లి ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, ఆర్‌డబ్యూఎస్ ఏఈలు వెంకటయ్య, ఫణీత్ క్రిష్ణ, వీఆర్‌ఓ లక్ష్మీనారాయణరెడ్డి, పంచాయతీ కార్యదర్శి జయరామిరెడ్డి, సర్పంచ్ మేకల ఓబులేష్ తదితరులు పాల్గొన్నారు.