అర్హులకు తక్షణమే ఇళ్లు అప్పగించాలి
మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణ శివారులో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు సిద్ధంగా ఉన్నా.. లబ్ధిదారులకు మాత్రం గృహయోగం దక్కడం లేదు. 2017లో 24 బ్లాకుల్లో చేపట్టిన 520 ఇళ్ల నిర్మాణంతో పాటు ఇటీవల మౌలిక వసతుల పనులు కూడా పూర్తయ్యాయి. అయితే, ఇళ్ల నిర్మాణం ప్రారంభించి తొమ్మిదేళ్లు గడుస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా నేటికీ లబ్ధిదారులకు కేటాయించ లేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వార్డుల వారీగా లాటరీ (డ్రా) పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ ఇళ్లను అప్పగించలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పాత జాబితా ప్రకారమే ఇళ్లు ఇవ్వాలా? లేక మళ్లీ కొత్తగా డ్రా తీయాలా? అనే తర్జనభర్జనలో పడింది. కాగా, ఆ ఇళ్ల నిర్మాణానికి భూమి ఇచ్చిన 40 మందికి నేరుగా ఇళ్లు కేటాయించి, గతంలో డ్రాలో ఎంపికై న వారిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులకు అందించాలని భావిస్తున్నట్లు సమాచారం.
కొన్న ప్లాట్లు గుంజుకున్నారు..
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం వెనుక మరో 253 మంది నిరుపేదల కన్నీటి గాథ దాగి ఉంది. మిర్యాలగూడలోని కిరాణా, వస్త్ర దుకాణాల గుమస్తాలు, టైలర్లు తదితర నిరుపేద కార్మికులు 1995లో ఇళ్ల స్థలాల కోసం రెవెన్యూ అధికారులకు విన్నవించారు. అప్పట్లో రాజకీయ నాయకుల చొరవతో తుంగపాడు శివారు (రైల్వేస్టేషన్ సమీపం)లో 21.05 ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే, ఎకరాకు ప్రభుత్వం నిర్ణయించిన రూ.80 వేల ధరకు రైతులు ఒప్పుకోకపోవడంతో.. 703 మంది కార్మికులు ఒక్కొక్కరు సగటున రూ.5 వేల చొప్పున జమచేసి రైతులకు చెల్లించారు. అనంతరం 1999లో లేఅవుట్ వేసి 703 మందికి 85 చదరపు గజాల చొప్పున పట్టాలు పంపిణీ చేశారు. ఇందులో 250 మంది వరకు ఇళ్లు కట్టుకోగా, మిగిలిన వారు ఆర్థిక ఇబ్బందులతో బేస్‌మెంట్లు మాత్రమే వేసుకుని వదిలేశారు.
ఇళ్లు పూర్తయినా తప్పని ప్రదక్షిణలు..
గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి స్థలం దొరక్కపోవడంతో రెవెన్యూ అధికారులు ఈ లేఅవుట్‌పై కన్నేశారు. ఇళ్లు కట్టుకోలేదన్న కారణంతో 2017లో అప్పటి తహసీల్దార్ 253 మందికి నోటీసులిచ్చి వారి ప్లాట్లను వెనక్కి తీసుకున్నారు. ఆ స్థలంలోనే ప్రస్తుత డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయాన్ని నిర్మించారు. స్థలాలు తీసుకున్నప్పుడే తమకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలని బాధితులు వేడుకున్నారు. ఇప్పుడు ఇళ్ల నిర్మాణం పూర్తవడంతో.. 1995లో అప్పులు చేసి రూ.5 వేలు కట్టి స్థలాలు కోల్పోయిన తాము ఆర్థికంగా నష్టపోయామని, తమకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించి న్యాయం చేయాలని కోరుతూ ఆ 253 మంది బాధితులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఫ మిర్యాలగూడలో పూర్తయిన
520 రెండు పడకల ఇళ్ల నిర్మాణం
ఫ తొమ్మిదేళ్లు గడిచినా లబ్ధిదారులకు దక్కని గృహయోగం
ఫ పాత జాబితానా?
మళ్లీ డ్రానా? వీడని సందిగ్ధం
ఫ 2017లో 253 మంది పేదల
ప్లాట్లు తీసుకుని డబుల్
బెడ్‌రూమ్‌ల నిర్మాణం
ఫ మాకై నా ఇవ్వాలని కార్యాలయాల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు
కోట్ల రూపాయలు వెచ్చించి రెండు పడకల ఇళ్లు నిర్మించారు. ఇటీవల నిధులు కేటాయించి విద్యుత్, రోడ్లు, వాటర్ ట్యాంక్ వంటి మౌలిక వసతుల పనులు కూడా పూర్తి చేశారు. పనులన్నీ పూర్తయి నెలలు గడుస్తున్నా లబ్ధిదారులకు అప్పగించకపోవడంతో ఇళ్ల తలుపులు, కిటికీల అద్దాలు మళ్లీ ధ్వంసమవుతున్నాయి. అధికారులు తక్షణమే స్పందించి అర్హులైన పేదలకు ఇళ్లు కేటాయించాలి.
– నాజర్‌అలీ మీర్జా, మిర్యాలగూడ


