అవసరమైన వారికి ఆసరా..
నల్లగొండ : దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను అందించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. భారతీయ కృత్రిమ అవయవాల తయారీ సంస్థ (ఏఎల్‌ఐఎంసీఓ) హైదరాబాద్ ఆధ్వర్యంలో జిల్లాలోని 33 మండలాలకు చెందిన దివ్యాంగుల గుర్తింపు కోసం ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నారు. వివిధ రకాల వైకల్యాలు కలిగిన వారికి వారి అవసరాలకు అనుగుణంగా ఉపకరణాలు అందించేందుకు అర్హులను ఈ శిబిరాల్లో గుర్తించనున్నారు. బ్యాటరీ మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు, శ్రవణ యంత్రాలు, చంక కర్రలు, ట్రెయిలీ కిట్లు, స్మార్ట్ కేన్లు, ట్రై సైకిళ్లు తదితర సహాయక పరికరాలను అవసరమైన వారికి అందించేందుకు ఈ శిబిరాలు నిర్వహిస్తున్నారు. డివిజన్ల వారీగా నాలుగు రోజుల పాటు శిబిరాలు కొనసాగనున్నాయి.
డివిజన్ల వారీగా శిబిరాల నిర్వహణ
ఫ 28న నల్లగొండ డివిజన్‌లోని మండలాలకు సంబంధించి నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బ జార్ టీఎన్‌జీవో భవన్‌లో శిబిరం నిర్వహిస్తారు.
ఫ 29న మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని మండలాల దివ్యాంగులకు మిర్యాలగూడలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోని రైతు వేదికలో శిబిరం ఏర్పాటు చేస్తారు.
ఫ 30న దేవరకొండ డివిజన్‌లోని మండలాల దివ్యాంగుల కోసం దేవరకొండ గిరిజన భవన్‌లో శిబిరం నిర్వహించనున్నారు.
ఫ అక్టోబర్ 1న చండూర్ డివిజన్‌లోని మండలాలకు చెందిన దివ్యాంగులకు చండూర్ తహసీల్దార్ కార్యాలయంలో శిబిరం నిర్వహిస్తారు.
ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి..
శిబిరానికి హాజరయ్యే దివ్యాంగులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. సదరం సర్టిఫికెట్, ఆదాయ ధ్రువపత్రం లేదా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటో తదితర పత్రాలను తీసుకురావాలి. అర్హత, అవసరాన్ని పరిశీలించిన అనంతరం సంబంధిత దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాల కోసం గుర్తింపు చేపట్టనున్నారు.
వైకల్యం కారణంగా నడవడం, వినడం, ఇతర రోజువారీ కార్యకలాపాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి సహాయక ఉపకరణాలు ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా బ్యాటరీ మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు వంటి పరికరాలు కదలిక సామర్థ్యాన్ని పెంచేందుకు దోహదపడతాయి. శ్రవణ యంత్రాలు, స్మార్ట్ కేన్, ట్రెయిలీ కిట్లు వంటి పరికరాలు ఆయా వైకల్యాలు కలిగిన వారికి అవసరమైన సహాయాన్ని అందించనున్నాయి. ఈ నేపథ్యంలో అర్హులైన దివ్యాంగులు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులు సూచించారు.
ఫ ప్రత్యేక క్యాంపుల ద్వారా గుర్తింపు
ఫ డివిజన్ల వారీగా శిబిరాల నిర్వహణ


