నాగార్జునసాగర్ : ఈ నెల 29వ తేదీన అనుముల మండలం ఇబ్రహీంపేటలో జిల్లా జూనియర్, సీనియర్ మహిళా కబడ్డీ జట్లను ఎంపిక చేయనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.భూలోకరావు, జి.కర్తయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ బాలికల విభాగంలో 20 సంవత్సరాల లోపు వయస్సు ఉండి 65 కిలోల లోపు బరువు ఉన్నవారు, సీనియర్ విభాగంలో 75 కిలోల లోపు బరువు ఉన్న మహిళా క్రీడాకారులు ఈ ఎంపికల్లో పాల్గొనాలని పేర్కొన్నారు. ఈ ఎంపికలు మ్యాట్‌పై జరుగుతున్నందున క్రీడాకారులందరూ మ్యాట్ షూతో రావాలని సూచించారు. జూనియర్ విభాగంలో పాల్గొనే బాలికలు తమ వెంట ఎస్‌ఎస్‌సీ మెమో, బర్త్ సర్టిఫికెట్ తీసుకురావాలని కోరారు.
మూసీకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతూ గరిష్ఠ స్థాయికి రెండు అడుగుల దూరంలో ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ఆదివారం మూసీ రిజర్వాయర్‌కు 1237 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా నీటిమట్టం 642.60 (గరిష్ట నీటిమట్టం645 అడుగులు)అడుగులకు చేరుకుంది. మూసీ కుడి ప్రధాన కాల్వకు 259 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 329 క్యూసెక్కుల చొప్పున మొత్తం 588 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.79 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.
రాష్ట్ర స్థాయి కరాటే
పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
నిడమనూరు : రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో నిడమనూరు మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఆదివారం నల్లగొండలో నిర్వహించిన షటోకాన్ రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో తృతీయ స్థానం సాధించారు. బాలికల జూనియర్ విభాగంలో ప్రథమ, ద్వితీయ స్థానాలను నాగార్జునసాగర్ విద్యార్థులు సాధించగా, నిడమనూరు మోడల్ స్కూల్ విద్యార్థిని సీహెచ్ రష్మిక తృతీయ స్థానంలో నిలిచింది. కరాటే మాస్టర్ బిందు ప్రోత్సాహంతో పలువురు విద్యార్థినీ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు.
యాదగిరి క్షేత్రంలో
విశేష పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో అర్చకులు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా విశేష పూజలు నిర్వహించారు. ఆదివారం వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు తొలుత సుప్రభాతం నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం చేపట్టి, సహస్రనామార్చన, కుంకుమార్చన వంటి పూజలు జరిపించారు. ముఖ మండపంలోని ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలను చేపట్టారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణ వేడుక, బ్రహ్మోత్సవం, సాయంత్రం తిరు మాఢ వీధుల్లో జోడు సేవలు జరిపించారు.


