నల్లగొండ టూటౌన్ : పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలు వివిధ వ్యాపారాల్లో రాణించేలా ఆర్థిక చేయూత అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గతేడాది మున్సిపాలిటీల్లో వంద శాతానికిపైగా రుణ లక్ష్యాలను అధిగమించారు. దీంతో 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను రుణాల మంజూరుకు జిల్లా ‘మెప్మా’ (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో ఉన్న 1,475 పొదుపు సంఘాల మహిళలకు రూ.200 కోట్ల రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది.
షరతులు లేకుండా రూ.20 లక్షల వరకు..
నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండ, హాలియా, చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఉన్న మహిళా సంఘాలకు తోడు.. ఈ ఏడాది కొత్తగా మరో 84 సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కొత్త సంఘాలకు సైతం రుణాలు అందించనున్నారు. పొదుపు సంఘాల సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకుల ద్వారా రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రుణాలు మంజూరు చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా ఆయా పురపాలికల వారీగా రుణ లక్ష్యాలను ఖరారు చేశారు.
కుటీర పరిశ్రమల స్థాపనకు ఊతం..
నల్లగొండ కార్పొరేషన్, ఇతర మున్సిపాలిటీల పరిధిలో మహిళలు ఆహార శుద్ధి కేంద్రాలు, కుటీర పరిశ్రమలు స్థాపించడంతో పాటు పలు చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వీరికి ఆర్థిక భరోసా కల్పించేందుకు మెప్మా ఆధ్వర్యంలో వడ్డీలేని రుణాల మంజూరు కోసం ఇటీవల పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో మహిళా సంఘాలకు రుణాలు అందించేందుకు బ్యాంకులు సైతం సిద్ధమయ్యాయి. ఈ రుణాల ద్వారా వేలాది మంది మహిళలకు మెరుగైన జీవనోపాధి లభించనుంది.
రుణాల మంజూరు లక్ష్యం ఇలా..
మున్సిపాలిటీ సంఘాలు రుణాలు
(రూ.కోట్లలో..)
నల్లగొండ(కార్పొరేషన్) 517 61.31
మిర్యాలగూడ 358 50.77
హాలియా 109 16.33
నందికొండ 48 6.25
దేవరకొండ 198 29.90
చండూరు 70 7.34
చిట్యాల 50 6.88
నకిరేకల్ 125 21.89
ఫ అతివలు వ్యాపారం చేసుకునేలా ఆర్థిక సాయం
ఫ 2026–27 సంవత్సరానికి ‘మెప్మా’ ప్రత్యేక కార్యాచరణ
ఫ నల్లగొండ కార్పొరేషన్, 7 మున్సిపాలిటీల్లో 1,475 సంఘాలకు లబ్ధి
ఫ కొత్తగా మరో 84 సంఘాల ఏర్పాటుకు ఆదేశం


