దేవరకొండ: వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం రోజుకు 16 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి, విద్యుత్ ఏడీఈ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పటికే రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని, దీనికి తోడు కరెంటు కోతలు విధిస్తుండడంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పరిహారం చెల్లించాలని కోరారు. ధర్నాలో పల్లా దేవేందర్‌రెడ్డి, తూం బుచ్చిరెడ్డి, వెంకటరమణ, దేప సుదర్శన్‌రెడ్డి, కనకాచారి, వెంకటయ్య, జయరాములు, విజేందర్‌రెడ్డి, శైలేష్, రామస్వామి, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


