పది రకాల ఫ్లేవర్లలో..
చిరుధాన్యాల బిస్కెట్స్, ఐస్‌క్రీం
ఫ ఇప్పటికే అందుబాటులో మిల్లెట్స్ ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్
ఫ పిండి వంటల్లోనూ మిల్లెట్స్‌కు ప్రాధాన్యం
చౌటుప్పల్, చిట్యాల :. టిఫిన్లు, ఐస్‌క్రీంలు, పిండి వంటలు అందరికీ ఇష్టమే. చిరుధాన్యాలతో చేసిన టిఫిన్లు ఇప్పటికే అందుబాటులో ఉండగా ప్రస్తుతం ఐస్‌క్రీంలు, స్నాక్స్ తయారవుతున్నాయి. చాలా చోట్ల చిరుధాన్యాలతో చేసిన ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్ దొరుకుతున్నాయి. ఇప్పుడు మిల్లెట్స్‌తో చేసిన బిస్కెట్లు, పిండి వంటలు కూడా అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట శివారులో గల హల్వా అంగడిలో చిరుధాన్యాలతో చేసిన ఇడ్లీ, దోశ, పెసరట్టుతో పాటు సజ్జ, జొన్నలతో చేసిన రకరకాల మిల్లెట్ బిస్కెట్లు, పిండి వంటలు లభిస్తున్నాయి. సాయంత్రం వేళ వేడివేడి మిల్లెట్ స్నాక్స్ ఇక్కడి ప్రత్యేకత. ఆరోగ్యానికి మంచి చేసే స్నాక్స్‌ను ప్రజలు ఇష్టపడి మరీ ఆరగిస్తున్నారు.
సాధారణంగా ఐస్‌క్రీమ్ అనగానే పాలు, పండ్లు, చాక్లెట్, వెనిల్లా వంటి రుచులే గుర్తుకొస్తాయి. కానీ, చిరుధాన్యాలతో తయారయ్యే ఐస్‌క్రీమ్‌లు ఇప్పుడు ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ పరిధిలో గల ‘విలేజ్ ఆర్గానిక్ హోటల్’లో ఏర్పాటు చేసిన మిల్లెట్స్ ఐస్‌క్రీమ్ స్టాల్‌లో పిస్తా, ఆల్మండ్, స్ట్రాబెర్రీ, ఓరియో, మ్యాంగో, బనానా, గ్రేప్స్, జాక్‌ఫ్రూట్, కస్టర్డ్ యాపిల్, చాక్లెట్ వంటి పది రకాల ఫ్లేవర్లలో మిల్లెట్స్ ఐస్‌క్రీమ్‌లు లభిస్తున్నాయి. ఆయా ఫ్లేవర్ల ఐస్‌క్రీంలలో రాగి, జొన్న, సజ్జలు వంటి మిల్లెట్స్‌ను కలిపి అందిస్తున్నారు. వీటిని హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తయారు చేయించి ఇక్కడ విక్రయిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఒక్కో ఐస్‌క్రీమ్ ధర రూ.130 నుంచి రూ.150 వరకు ఉంది. ఆర్గానిక్ పదార్థాలు, చిరుధాన్యాలతో తయారు చేయడం వల్ల ప్రయాణికులు వీటిని రుచి చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.


