– నర్రా శేఖర్‌రెడ్డి, ఉపాధ్యాయుడు
మిర్యాలగూడ టౌన్ : మాది నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడి, నా భార్య కరుణ గృహిణి. మా కుటుంబంలో ఆడ పిల్లలు లేరు. కానీ మాకు ఆడపిల్లే పుట్టాలని అనుకున్నాం. అనుకున్నట్లుగానే ఆడపిల్ల జన్మించింది. ఒక్కరితోనే సరిపెట్టుకుని మంచిగా చదివించి ఉన్నతస్థానంలో నిలపాలని భావించాం. మా ఆలోచనకు తగినట్టుగానే శ్రీజ చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుకుగా ఉండేది. ఆనాటి నల్లగొండ కలెక్టర్ రిజ్వీని స్ఫూర్తిగా తీసుకొని సివిల్స్ సాధిస్తానని మాతో చెప్పింది. అందుకు మేము శ్రీజకు సహకరించాం. మా కుమార్తె సక్సెస్ చూడాలని అనుకున్నాం. అందులో భాగంగానే.. ఎక్కడా రాజీపడకుండా చదించాం. ఇంటర్ పూర్తయ్యాక చాలా మంది మీ పాపను డిగ్రీ ఎందుకు చదివిస్తున్నారు.. బీటెక్ చదివిస్తే బాగుండేది కదా అని మాతో అన్నారు. కానీ ఎవరెన్ని చెప్పినా మా పాప కోరిన విధంగానే డిగ్రీ చదివించాం. తన లక్ష్యాన్ని సాధించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేసింది. అవకాశాలను అందిపుచ్చుకుంటూ, లక్ష్య సాధనలో ముందుకు సాగుతూ గ్రూప్–1 సాధించి మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తోంది. సివిల్ సాధించడమే తన లక్ష్యమని చెబుతోంది. ఆడపిల్లలకు అవకాశం ఇస్తే ఎంతటి విజయాన్ని అయినా ఇట్టే సాధించగలరని శ్రీజ నిరూపించింది. మా శ్రీజ ఈ స్థాయికి రావడం మాకు ఎంతో గర్వంగా ఉంది.


