చిట్యాల, తిప్పర్తి, మాడుగులపల్లి : వ్యవసాయ విద్యుత్ సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలని టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన జిల్లాలోని చిట్యాల, తిప్పర్తి, మాడుగులపల్లి మండలాల్లో సబ్‌స్టేషన్లు, రైతుల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. తొలుత చిట్యాల మండలం ఆరెగూడెం సబ్‌స్టేషన్‌ను సందర్శించిన వ్యవసాయ విద్యుత్ సరఫరా, ఫీడర్ల స్థితిగతులపై ఆరా తీశారు. సబ్‌స్టేషన్ సమీపంలోని వరి పొలాలను సందర్శించి రైతులతో నేరుగా మాట్లాడారు. తర్వాత తిప్పర్తి మండలం కేశరాజుపల్లిలో వరి పొలాలను సందర్శించిన బోరుద్వారా సాగునీటి ప్రవాహాన్ని పరిశీలించారు. పొలాల్లోనే రైతులతో ముఖాముఖి సమావేశమై పంటల సాగు పరిస్థితులు, నీటి లభ్యత, విద్యుత్ సరఫరాపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఉచిత విద్యుత్‌ను అందిస్తోందని తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ శాఖ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తుందన్నారు. తర్వాత మాడుగులపల్లి మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. కార్యక్రమంలో రూరల్ జోన్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి, ఎస్‌ఈ శ్రీనివాసులు, ఆపరేషన్ డీఈ విద్యాసాగర్‌రావు, నల్లగొండ రూరల్ ఏడీఈ ఎల్.శ్రీను, మిర్యాలగూడ రూరల్ ఏడీఈ ఇందిరా, ఏఈలు రవీందర్‌రెడ్డి, శివకుమార్, మణిదీప్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వి పాటిల్


