సాక్షి ప్రతినిధి, నల్లగొండ : చేయూత పథకం కింద కొత్త పింఛన్ల కోసం జిల్లాలో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం రెండోసారి గడువు ఇవ్వడంతో అర్హులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని 33 మండలాలు, 8 మున్సిపాలిటీల పరిధిలో 32,987 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తవుతుండగా.. తర్వాత అర్హతల పరిశీలన చేయనున్నారు.
గడువు పొడిగింపుతో
పెరిగిన సంఖ్య
చేయూత పథకం కింద కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం మొదట ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గడువు ఇచ్చింది. తరువాత సెప్టెంబరు 15వ తేదీ వరకు పొడిగించింది. దీంతో జిల్లాలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే..
ఆన్‌లైన్‌లో నమోదైన దరఖాస్తుల ఆధారంగా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపడుతున్నారు. ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దరఖాస్తుదారుల వయస్సు, కుటుంబ పరిస్థితులు, వృత్తి, ఇతర అర్హతలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయనున్నారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్నవారిని మాత్రమే అర్హులుగా గుర్తించనున్నారు.
పరిశీలన తరువాతే తుది జాబితా
దరఖాస్తు చేసుకున్న వారందరికీ పింఛన్ మంజూరయ్యే అవకాశం ఉండదు. క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హతలను నిర్ధారించిన తరువాతే తుది జాబితా సిద్ధం చేయనున్నారు. దీంతో దరఖాస్తుదారులంతా అర్హుల జాబితా కోసం ఎదురుచూస్తున్నారు. 25వ తేదీలోగా పరిశీలన పూర్తయిన అనంతరం అర్హుల జాబితాను ప్రకటించనున్నారు.
పట్టణాల్లో నల్లగొండ టాప్
పట్టణ ప్రాంతాల్లో నల్లగొండ మున్సిపాలిటీ నుంచి అత్యధికంగా 2,426 దరఖాస్తులు వచ్చాయి. మిర్యాలగూడ మున్సిపాలిటీ నుంచి 1,560 దరఖాస్తులు నమోదయ్యాయి. మరోవైపు నందికొండ మున్సిపాలిటీ నుంచి అత్యల్పంగా 190 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
మండలాల్లో కట్టంగూర్ ముందంజ
గ్రామీణ మండలాల వారీగా చూస్తే కట్టంగూర్ 1,354 దరఖాస్తులతో ముందంజలో ఉంది. మిర్యాలగూడ మండలం నుంచి 1,351, శాలిగౌరారం నుంచి 1,279, మునుగోడు నుంచి 1,257 దరఖాస్తులు నమోదయ్యాయి. దీంతో ఈ మండలాల్లో క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ కీలకంగా మారనుంది.
ఫ 25వ తేదీలోగా క్షేత్రస్థాయి పరిశీలన
ఫ ఆ తర్వాత అర్హుల జాబితా ప్రకటన
పింఛన్ల దరఖాస్తుల వివరాలు ఇలా..
కేటగిరీ దరఖాస్తుల సంఖ్య
వితంతు 15,277
దివ్యాంగులు 9,085
గీత కార్మికులు 4,416
ఒంటరి మహిళలు 2,955
చేనేత కార్మికులు 1,254
మొత్తం 32,987


