నల్లగొండ టూటౌన్ : వినాయక నవరాత్రులు జిల్లాలో ఉత్సాహంగా సాగుతున్నాయి. కానీ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో నల్లగొండ నగరం పరిధిలోని చెరువుల్లో నీరులేదు. దీంతో గణేష్ నిమజ్జనం ఎక్కడ చేయాలనే దానిపై ఇప్పటివరకు యంత్రాంగం ఒక నిర్ణయానికి రాలేదు. నీలగిరి నగరంలో 563 గణపతి విగ్రహాలు, మండలంలో 265 విగ్రహాలు ఉన్నాయి. మొత్తం 828 విగ్రహాలు ఉన్నాయి. తొలుత చర్లపల్లిలోని భీమ సముద్రంలో గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేయాలని భావించారు. కానీ అక్కడ సరిపడా నీరు లేదు.
వల్లభరావు చెరువులోనూ మునగవు..
పానగల్ సమీపంలోని అద్దంకి బైపాస్ రోడ్డు వద్ద ఆర్జాలబావి వల్లభరావు చెరువులో నీరు నిండుగా ఉంటేనే ఆరు, ఏడు ఫీట్ల ఎత్తు విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయడానికి వీలుగా ఉంటుంది. కానీ నగరంలో 15 ఫీట్లకు పైగా ఎత్తు ఉన్న గణపతి విగ్రహాలు కూడా పలు కాలనీల్లో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాలు నిమజ్జనం చేసినప్పుడు మునగాలంటే కనీసంగా 20 ఫీట్ల లోతు చెరువులో నీరుండాలి.
14వ మైలు వద్దకే..
గణేష్ నిమజ్జనం కోసం ముందస్తుగానే ఏర్పాట్లు చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు ప్రతిష్టంబన నెలకొంది. ప్రస్తుతం 14వ మైలు వద్ద నాగార్జునసాగర్ ఎడమకాల్వలో నీరు ప్రవహిస్తోంది. కానీ నీటిని ఎన్ని రోజుల వరకు విడుదల చేస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో 14 మైలు ఎడమకాల్వలో తప్ప మరో దారి లేదని భక్తులు చెబుతున్నారు.
ఫ భీమ సముద్రంలో నీళ్లులేవు.. ఆర్జాలబావి చెరువులో పెద్ద విగ్రహాలు మునగవు
ఫ నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో 563 విగ్రహాలు
ఫ 14వ మైలు వద్దనే నిమజ్జనానికి అవకాశం
భక్తులకు ఇబ్బంది కలగొద్దు
హాలియా : భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన అలీనగర్ (14వ మైలురాయి) సమీపంలో వినాయక నిమజ్జనం నిర్వహించే సాగర్ ఎడమ కాలువ వద్ద ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. కాలువలో ఈనెల 22 నుంచి 25 వరకు నీరు తగ్గకుండా ఒకేస్థాయిలో ఉండేలా చూడాలని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నిమజ్జనానికి కావాల్సిన క్రేన్లు, వాహనాలు, ఇతర సామగ్రిని ముందే సిద్ధం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డి, డీఎస్పీ రవి, సీఐ రాఘవరావు పాల్గొన్నారు.


