గుండ్రాంపల్లికి గుర్తింపునివ్వాలి
ప్రత్యేక నిధులను కేటాయించాలి
చిట్యాల : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో గుండ్రాంపల్లి గ్రామం రజాకార్ల దాడులకు ప్రధాన కేంద్రం. సయ్యద్ మక్బూల్ ఆధ్వర్యంలో రజాకార్లు సాగించిన దౌర్జన్యాలను ఈ ఊరంతా ఏకమై ఎదుర్కొంది. కొండవీటి గురునాథరెడ్డి, కొండవీటి జగన్మోహన్‌రెడ్డి, గుత్తా సీతారాంరెడ్డి వంటి నాయకుల నేతృత్వంలో గ్రామస్తులు పోరాట జెండాను ఎగురవేశారు. ఈ క్రమంలో తిరుగుబాటును అణచివేయడానికి రజాకార్లు సాగించిన అమానుషకాండ గుండ్రాంపల్లి చరిత్రలో అత్యంత విషాదకర ఘట్టం. విప్లవకారులుగా భావించిన ఆ గ్రామానికి చెందిన 30 మందికి పైగా యువకులను బంధించి, ఎడ్లబండికి కట్టి ఊరి నడిబొడ్డున ఉన్న (ప్రస్తుతం ఏపూరుకు వెళ్లే దారిలో) బావిలో పడేసి సజీవంగా సమాధి చేశారు. ఆ తర్వాత జరిగిన పలు దాడుల్లో మరో వంద మందికి పైగా పోరాటయోధులు అమరులయ్యారు. నాటి పోరాటానికి సాక్ష్యంగా నిలిచిన ఆ చారిత్రక బావి పైనే నిర్మించిన అమరవీరుల స్థూపం నేటికీ జ్ఞాపకంగా నిలిచిపోయింది.
చరిత్రను కాపాడుకోవాలంటున్న కొత్త తరం..
గుండ్రాంపల్లి గ్రామాభివృద్ధితో పాటు చారిత్రక ప్రాధాన్యాన్ని కూడా కాపాడుకోవాలని నేటి యువత భావిస్తోంది. నాటి పోరాట స్ఫూర్తితో ఆ గ్రామ యువతతో పాటు గ్రామస్తులంతా రాజకీయ పార్టీలకు అతీతంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే విజ్ఞానాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో, ఇరవై ఏళ్ల క్రితమే యువత స్వచ్ఛందంగా గ్రామంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. ఈ గ్రంథాలయ స్ఫూర్తితో ప్రస్తుతం చుట్టుపక్కల గ్రామాల్లో మరో 30కి పైగా గ్రంథాలయాలు ఏర్పాటయ్యాయి. అంతేకాకుండా, ఈ గ్రామం జాతీయ రహదారిపై ఉండటంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. పోరాట చరిత్రయే మా వారసత్వం అన్నట్లుగా.. ప్రజా సమస్యలపై నిలదీసే తత్వంతో ఈ గ్రామ యువత చైతన్యవంతంగా ఉంటుంది.
ఫ సాయుధ పోరాట అమరుల త్యాగాలను స్మరించుకుంటున్న నేటి తరం
ఫ ప్రజా సమస్యలపై నేటికీ తగ్గని యువకుల పోరాట స్ఫూర్తి
ఫ నేడు హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందిన రోజు
నిజాంకు నవాబుకు, రాజ కార్లకు వ్యతిరేకంగా పోరా టం చేసిన గుండ్రాంపల్లి గ్రామ చరిత్రకు తగిన గుర్తింపును ప్రభుత్వాలు ఇవ్వాలి. పోరాట చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చటంతో పాటు ఏటా సెప్టెంబర్ 17న మా గ్రామంలో అధికారికంగా ఉత్సవాలను నిర్వహించాలి.
– అనుముల శ్రీనివాస్, స్థానికుడు
మా గుండ్రాంపల్లి గ్రామానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. నాటి రైతాంగ సాయుధ పోరాటంతో పాటు తెలంగాణ మలిదశ ఉద్యమంలో సైతం మా గ్రామంలో యువత ముందుంది. మా గ్రామ పంచాయతీకి ప్రత్యేక నిధులను కేటాయించి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సహకరించాలి.
– బత్తుల లక్ష్మీప్రసన్న, స్థానికురాలు
గ్రామాన్ని సందర్శించిన ప్రముఖులు..
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా 2017 జూలైలో గుండ్రాంపల్లి గ్రామాన్ని సందర్శించారు. నాటి పోరాటంలో అమరులైన వీరుల కుటుంబాలను ఆయన సత్కరించారు. 2017 ఆగస్టులో ప్రస్తుత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాదయాత్ర చేస్తూ ఈ గ్రామాన్ని సందర్శించారు. వీరితో పాటు సీపీఐ మాజీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఐ జాతీయ నాయకులు ఎన్.గిరిప్రసాద్, ధర్మభిక్షం, గద్దర్, మాజీ సీఎం కేసీఆర్, మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి సాంబశివుడు తదితరులు గతంలో ఈ గ్రామాన్ని పలుమార్లు సందర్శించి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.


