నల్లగొండ : అంతర్జాతీయ ప్రమాణాలు ఉండేలా నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్‌ను ఆధునీకరిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో బస్టాండ్ ఆధునీకరణపై ఆయన సమీక్షించారు. బస్టాండ్ నమూనాను కన్సల్టెన్సీ ప్రతినిధులు మంత్రికి వివరించారు. నమూనాలో పలు మార్పులు చేయాలని ప్రతినిధులకు మంత్రి సూచించారు. నల్లగొండ బస్టాప్ ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉంటుందని.. అందుకు అనుగుణంగా బస్సుల రాకపోకలు సులభతరం అయ్యేలా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్, ప్లాట్‌ఫారాలు, వెయిటింగ్ హాల్స్, పార్కింగ్, మరుగుదొడ్లు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్టీసీకి లాభం కలిగించేలా గ్రౌండ్, మొదటి అంతస్తులో షాపింగ్ మాల్ ఏర్పాటు చేయాలని, ప్రజలకు వినోదాన్ని అందించేందుకు రెండవ అంతస్తులో మల్టిఫ్లెక్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్టీసీపై విద్యుత్ భారం పడకుండ బస్టాండ్ పైభాగంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు. దసరాకు రెండు రోజుల ముందు ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. నిర్మాణ సమయంలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. బస్టాండ్ ఆధునీకరణ తరువాత షాపుల ద్వారా ఆర్టీసీకి రూ.85 లక్షల వరకు ఆదాయం చేకూరే అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, అధికారులు, కన్సల్టెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


