ప్రభుత్వం త్వరలోనే పొదుపు సంఘాలకు సంబంధించిన వడ్డీ డబ్బులు విడుదల చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాగానే సంబంధిత పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం.
– శ్రీనివాస్, మెప్మా పీడీ
నల్లగొండ టూటౌన్ : పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వాలు మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోయిందనే విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటి వరకు పొదుపు సంఘాల మహిళలు తీసుకున్న రుణాలకు వడ్డీ రాలేదు. జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లో 6,575 పొదుపు సంఘాలకు దాదాపు రూ. 25.36 కోట్లు రావల్సి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
గత ప్రభుత్వ బకాయి రూ.14 కోట్లు..
జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, చిట్యాల, నందికొండ, చండూరు, నకిరేకల్, హాలియా మున్సిపాలిటీల్లో పొదుపు సంఘాలకు 2019 నుంచి 2023 వరకులోపు వరకు వడ్డీ రూ.14 కోట్లు రావాల్సి ఉంది. అదే విధంగా 2025–26 సంవత్సరానికి సంబంధించి రూ.11.36 కోట్లు రావాల్సి ఉన్నా ప్రభుత్వం విడుదల చేయలేదు. వడ్డీ డబ్బులు సకాలంలో విడుదల చేయని కారణంగా పొదుపు సంఘాలకు మేలు జరుగడంలేదు. వడ్డీ లేని రుణం (వీఎల్‌ఆర్) ఇస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయే తప్ప బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీని తిరిగి ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నాయి.
గత ప్రభుత్వ హయాం వడ్డీపై అస్పష్టత..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2023–24, 2024–25 సంవత్సరాలకు సంబంధించి రెండు సంవత్సరాల వడ్డీ డబ్బులను పొదుపు సంఘాలకు జమ చేసింది. కానీ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయంలో పెరుకుపోయిన వడ్డీ డబ్బులు ఇస్తారా లేదా అనే దానిపై అస్పష్టత నెలకొంది. ప్రభుత్వాలు చెప్పిన ప్రకారం ప్రతి సంవత్సరం వడ్డీ డబ్బులు విడుదల చేయని కారణంగా పొదుపు సంఘాల మహిళలు నష్టపోతున్నారు.
వడ్డీ వస్తేనే మహిళలకు ప్రయోజనం..
ఆరేళ్లుగా ప్రభుత్వం పొదుపు సంఘాలకు ప్రభుత్వాలు వడ్డీ విడుదల చేయకపోవడంతో కొత్త సంఘాల ఏర్పాటుపై ఈ ప్రభావం పడుతోంది. కొత్తగా సంఘాలు ఏర్పాటు చేసుకునే వాళ్లు ప్రతి నెల 10వ తేదీలోగా చెల్లించకపోతే తమకు అధిక వడ్డీ పడుతుందని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వడ్డీ వస్తేనే మహిళా సంఘాలకు ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతుంది.
ఫ పట్టణాల్లోని మహిళా సంఘాలకు అందని సొమ్ము
ఫ ప్రతి నెలా రుణం చెల్లిస్తున్నా.. వడ్డీ ఇవ్వడంలో జాప్యం


