రామగిరి(నల్లగొండ) : నాగార్జున కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో ఈ నెల 26న ఆచార్య అనుమాండ్ల భూమయ్య సాహిత్య స్వర్ణోత్సవం (1976–2026) పేరిట ఒక రోజు జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్ తెలిపారు. సోమవారం కళాశాల ప్రాంగణంలో సదస్సుకు సంబంధించిన బ్రోచర్‌ను అధ్యాపకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆచార్య అనుమాండ్ల భూమయ్య పద్య కవిగా, గేయ కావ్య కర్తగా, ప్రముఖ విమర్శకునిగా ఇప్పటివరకు 54 గ్రంథాలను రచించి విశేష సేవలు అందించారన్నారు. ఆయన సాహిత్యాన్ని నేటి తరానికి పరిచయం చేయాలనే ప్రధాన లక్ష్యంతోనే ఈ సదస్సును రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పరంగి రవికుమార్, తెలుగు శాఖాధ్యక్షుడు వెల్దండి శ్రీధర్, అంతటి శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణ అధికారి డి.మునిస్వామి, విద్యా విషయక సమన్వయకర్త బి. నాగరాజు, అధ్యాపకులు వాస భూపాల్, టంగుటూరి సైదులు, ఎస్.ప్రభాకర్, దండి అంజయ్య, లింగస్వామి, వనజ, శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు.


