ఉన్నతాధికారుల
ఆదేశాలు పాటిస్తాం
నల్లగొండ : రేషన్ దుకాణాలు, ఎంఎల్‌ఎస్ పాయింట్లలో నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని విక్రయించేందుకు పౌరసరఫరాల శాఖ చేపట్టిన టెండర్ ప్రక్రియకు వ్యాపారుల నుంచి స్పందన కరువైంది. జిల్లాలో భారీగా దొడ్డు బియ్యం నిల్వలు ఉండి కిలో బియ్యానికి రూ.21.60 బేస్ ధరగా నిర్ణయించి టెండర్లు ఆహ్వానించినా.. నల్లగొండ జిల్లాలో ఒక్క వ్యాపారి కూడా బిడ్ దాఖలు చేయలేదు. సెప్టెంబర్ 1న టెండర్ బాక్సులు తెరిచినప్పుడు ఖాళీగా దర్శనమివ్వడం పలు ప్రశ్నలకు తావిస్తోంది.
2,091 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం
గతేడాది ఏప్రిల్ నుంచి రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. దీంతో అప్పటివరకు రేషన్ దుకాణాల్లో ఉన్న దొడ్డు బియ్యం నిల్వలను ఎంఎల్‌ఎస్ పాయింట్లకు తరలించారు. అయినప్పటికీ జిల్లాలోని పలు రేషన్ దుకాణాల్లో నిల్వలు అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 2,091 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం నిల్వ ఉన్నట్లు అధికారులు వాటికి టెండర్లను ఆహ్వానించారు. ఒక్కో రేషన్ దుకాణంలో సుమారు 20 నుంచి 50 క్వింటాళ్ల వరకు బియ్యం నిల్వ ఉన్నట్లు సమాచారం. వీటికి అదనంగా స్టేజ్–1, స్టేజ్–2 గోదాముల్లోనూ భారీగా బియ్యం నిల్వలు ఉన్నాయి.
వ్యాపారుల నుంచి స్పందనే లేదు
మార్చిలో దొడ్డు బియ్యాన్ని కిలో రూ.21.60 చొప్పున విక్రయించేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయించి. పౌరసరఫరాల శాఖ టెండర్లు ఆహ్వానించింది. నల్లగొండ జిల్లాలోనూ టెండర్లు పిలిచారు. సెప్టెంబర్ 1న టెండర్లను తెరవగా.. ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు. పాత బియ్యం నాణ్యతపై వ్యాపారులకు సందేహాలున్నాయా? రవాణా, నిల్వ, ఇతర ఖర్చులు కలిపి ధర ఎక్కువగా అనిపించిందా? లేక వ్యాపారుల మధ్య ఏదైనా ముందస్తు అవగాహన ఉందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. అయితే వీటిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.
నిల్వతో నాణ్యతకు దెబ్బ
ఏడాదిన్నర కాలంగా నిల్వ ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో బియ్యం నాణ్యత దెబ్బతిన్నట్లు సమాచారం. స్థల కొరత, సరైన నిల్వ సౌకర్యాలు లేకపోవడం, వ ర్షాలు, తేమ తదితర కారణాలతో బియ్యం పురుగు పట్టడం, ముక్కిపోవడం వంటి సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. మరోవైపు కొందరు డీలర్లు బియ్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయిందని, ఎలుకలు, పందికొక్కుల పాలైందని చెబుతున్నట్లు సమాచారం.
గతంలో ఇతర జిల్లాలకు తరలించినా ఇప్పుడు బిడ్డర్లే లేరా?
ఇటీవల నల్లగొండ జిల్లా నుంచి రేషన్ బియ్యాన్ని లారీల్లో ఇతర జిల్లాలకు తరలించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. బియ్యం కొనుగోలు చేసి బయటకు తరలించే వ్యాపారులు ఉన్నప్పటికీ ప్రభుత్వం అధికారికంగా టెండర్ పిలిచినప్పుడు మాత్రం ఒక్కరూ ముందుకు రాకపోవడం చర్చకు దారితీస్తోంది.
మళ్లీ టెండర్ పిలుస్తారా..!
మొదటి దఫా టెండర్‌కు ఒక్క బిడ్ కూడా రాకపోవడంతో అధికారులు తదుపరి ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. బేస్ ధరను పునః పరిశీలిస్తారా? మరోసారి టెండర్లు పిలుస్తారా? లేక ఇతర మార్గాల్లో నిల్వ బియ్యాన్ని విక్రయిస్తారా? అన్నది వేచిచూడాలి. ఒకవైపు జిల్లాలో వేలాది టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు.. మరోవైపు వాటిని కొనుగోలు చేసేందుకు ఒక్క బిడ్డర్ కూడా ముందుకు రాకపోవడం.. ఇప్పుడు పౌరసరఫరాల శాఖకు సవాల్‌గా మారింది.
దొడ్డు బియ్యం కొనేందుకు ముందుకురాని వ్యాపారులు
ఫ రూ.21.60 బేస్ ధరకు దాఖలుకాని టెండర్లు
ఫ నల్లగొండలో 2,091 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు
ఫ ధర గిట్టుబాటు కాదా..? లేక
వ్యాపారుల మధ్య ‘రింగ్’ జరిగిందా..?
దొడ్డు బియ్యం విక్రయానికి సంబంధించి పైఅధికారుల ఉత్తర్వుల మేరకే నడుచుకుంటాం. మళ్లీ టెండర్ పిలవాలి అంటారా.. లేక ఏం చేస్తారనేది ఇంకా ఉత్తర్వులు రావాల్సి ఉంది. టెండర్ దాఖలులో ఎవరు పాల్గొనలేదని అధికారులకు సమాచారం ఇచ్చాం.
– రామ్‌పతి, జిల్లా సరఫరాల శాఖ మేనేజర్


