నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన లా కళాశాలలో పార్ట్‌టైం ప్రాతిపధికన అధ్యాపకులను నియమించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆకుల రవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం విద్యార్థులకు భోదించేందుకు అర్హత, అనుభవం కలిగిన అభ్యర్థులు పూర్తి బయోడేటాతో కళాశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలని కోరారు. వివరాల కోసం 9948361250 నెంబర్‌లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
వైద్య సేవలు మెరుగుపర్చాలి
కట్టంగూర్ : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు అందించే సేవలను మెరుగు పరచాలని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి, టీజీఎంఎస్‌ఐడీసీ (తెలంగాణ వైద్య సేవలు, మౌళివ వసతుల అభివృద్ధి సంస్థ) ఎండీ గౌరవ్ ఉప్పల్ అన్నారు. శనివారం కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని విభాగాలను, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి రాపోలు జమున, సిబ్బంది చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.
ఐటీఐల్లో మిగిలిన
సీట్లకు అడ్మిషన్లు
నల్లగొండ : ఈ విద్యా సంవత్సరంలో ఐటీఐ/ఏటీసీల్లో మిగిలి ఉన్న సీట్లకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఐటీఐల కన్వీనర్, ప్రిన్సిపాల్ నర్సింహాచారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 7వ తేదీలోగా మొబైల్ నెంబర్‌తో http://iti.telangana.gov.inలో వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని, ఈ నెల 7న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వారు కోరుకున్న ఏటీసీ, ఐటీఐలకు ఆన్‌లైన్ దరఖాస్తు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు నల్లగొండలోని ఐటీఐ కార్యాలయంలో సంప్రదించాలరని సూచించారు.
యాదగిరి క్షేత్రంలో
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నిత్యారాధనలు సంప్రదాయంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, ఆరాధన, స్వయంభువులకు నిజాభిషేకం, సహస్ర నామార్చన, కుంకుమార్చన నిర్వహించారు. ఇక ఆలయ ముఖ మండపంలోని ఉత్సవ మూర్తుల వద్ద సువర్ణ పుష్పార్చన వంటి పూజలు జరిపించారు. ప్రథమ ప్రాకార మండపంలో గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం జోడు సేవోత్సవం వంటి పూజలను జరిపించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. కాగా శనివారం ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. శ్రావణ మాసంలో శ్రీస్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో భక్తులు అధికంగా తరలివచ్చారు.


