మర్రిగూడ : ఇంటిని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మహిళ మృతిచెందింది. ఈ ఘటన మర్రిగూడ మండల కేంద్రంలో శనివారం జరిగింది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిగూడ మండల కేంద్రానికి పగడాల చెన్నమ్మ(56), ఆమె భర్త అంజయ్య గత కొన్నేళ్లుగా ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆదివారం గ్రామంలో బోనాలు ఉన్నందున శుక్రవారం స్వగ్రామానికి చేరుకున్నారు. శనివారం బోనాల పండుగ సందర్భంగా చెన్నమ్మ ఇంటిని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లను తాకడంతో విద్యుదాఘాతానికి గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి భర్త అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బి. రాంబాబు తెలిపారు.


