వేతనాలు అందక ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

వేతనాలు అందక ఇబ్బందులు

Sep 6 2026 2:25 AM | Updated on Sep 6 2026 2:25 AM

కుటుంబ పోషణ కష్టంగా మారింది నిత్యావసరాలు కొనేందుకూ ఇబ్బందే

మిర్యాలగూడ అర్బన్‌ : 19 నెలలుగా విధులు నిర్వర్తిస్తున్నా వేతనాలు అందకపోవడంతో ఆరోగ్యశ్రీ డేటా ఎంట్రీ ఆపరేటర్ల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. మిర్యాలగూడలోని ఏరియా ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్లు, ఇతర వైద్య సేవలు అందించే క్రమంలో రోగుల వివరాలను నమోదు చేసేందుకు డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించారు. ఆస్పత్రికి ఆరోగ్యశ్రీ నిధులు విడుదలైన సమయంలో, ఆ నిధుల నుంచే వీరికి వేతనాలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే, 2025 జనవరి నుంచి నేటి వరకు జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న ఈ సిబ్బందికి వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కీలక విధులు.. కరువైన ఉపాధి!

ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల వివరాల నమోదు, ఆరోగ్యశ్రీ కార్డుల ధ్రువీకరణ, చికిత్స ప్రక్రియ, వైద్య సేవల సమన్వయం, ఆపరేషన్ల తర్వాత రోగుల పర్యవేక్షణ, బస్సు చార్జీల పంపిణీ వంటి కీలక విధులను ఈ ఆపరేటర్లే నిర్వర్తిస్తుంటారు. ప్రస్తుతం నల్లగొండ ఏరియా ఆస్పత్రిలో ఐదుగురు, మిర్యాలగూడలో ఏడుగురు, దేవరకొండ, నాగార్జునసాగర్‌, నకిరేకల్‌ ఆస్పత్రుల్లో ఒక్కొక్కరు చొప్పున సేవలు అందిస్తున్నారు. వీరందరికీ గత 19 నెలలుగా వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఇదిలా ఉంటే, వేతనాలు ఇవ్వలేమనే సాకుతో అధికారులు ఇప్పటికే ఇద్దరు ఉద్యోగులను తొలగించారు. మరో నెల రోజుల్లో నిధులు విడుదల కాకుంటే మిగిలిన వారిని కూడా తొలగించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. దీంతో ఏళ్లుగా పనిచేస్తున్న తమ ఉపాధి ప్రమాదంలో పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే ఏరియా ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు మాకు వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఉపాధి కోసం పనిచేస్తున్న మాకు సకాలంలో జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే నిధులు విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలి.

– రాపోలు నిరంజన్‌,

ఆరోగ్యశ్రీ డేటా ఎంట్రీ ఆపరేటర్‌

ఆస్పత్రిలో పనిచేసే మాకు ఇళ్లలో నిత్యావసర వస్తువులు కొనేందుకు సైతం ఇబ్బందిగా ఉంది. సకాలంలో వేతనాలు విడుదల చేయకపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఇప్పటికై నా ప్రభుత్వం మా బాధలు అర్థం చేసుకుని, నిధులు విడుదల చేసి వేతనాలు అందించాలి.

– ధనావత్‌ బాలు, ఈసీజీ టెక్నీషియన్‌

ఫ 19 నెలలుగా ఆరోగ్యశ్రీ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు అందని వేతనాలు

ఫ కుటుంబ పోషణ భారమై అవస్థలు

పడుతున్న సిబ్బంది

ఫ వేతనాలు ఇవ్వలేమంటూ ఇప్పటికే ఇద్దరి తొలగింపు

ఫ తమనూ తీసేస్తారేమోనని మిగిలిన వారిలో ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement