నర్రా రాఘవరెడ్డి పేరు పెట్టాలని వినతి | - | Sakshi
Sakshi News home page

నర్రా రాఘవరెడ్డి పేరు పెట్టాలని వినతి

Sep 6 2026 2:25 AM | Updated on Sep 6 2026 2:25 AM

నకిరేకల్‌ : నకిరేకల్‌లో నూతనంగా ప్రారంభించిన 100 పడకల వైద్యశాలకు మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత నర్రా రాఘవరెడ్డి పేరు పెట్టాలని సీపీఎం ఆధ్వర్యంలో శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో నాయకులు కందాల ప్రమీల, రాచకొండ వెంకన్నగౌడ్‌, వంటెపాక వెంకటేశ్వర్లు, బొజ్జ చిన వెంకులు తదితరులు ఉన్నారు.

ఇంటి నిర్మాణం కూలి కార్మికుడు మృతి

హస్తినాపురం : ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా అకస్మాత్తుగా ఒక భాగం కూలిపోవడంతో కార్మికుడు మృతిచెందాడు. వనస్థలిపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్‌బీనగర్‌లోని ప్రథన్‌ ఆర్పెడ్‌కు చెందిన పసునూరు అనంత్‌ ఆత్రేయ ఇంటి పునరుద్ధరణ పనులు మల్లికార్జున్‌కాలనీలో జరుగుతున్నాయి. నలుగురు కార్మికులు పనులు చేస్తుండగా శనివారం మధ్యాహ్నం నిర్మాణంలోని ఓ భాగం అకస్మాత్తుగా కార్మికులపై పడింది. ఈ ప్రమాదంలో ఎన్‌టీఆర్‌ నగర్‌లో నివాసముంటున్న కేశబోయిన సైదులు (48) తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒడిస్సాకు చెందిన మరో కార్మికుడు ప్రతాప్‌ గోర్లే గాయపడడంతో చికిత్స నిమిత్తం శ్రీకర ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సైదులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు నల్లగొండ జిల్లా రాజపేటకు చెందినవాడని పోలీసులు పేర్కొన్నారు.

బైక్‌తో యువకుడి స్టంట్‌.. కేసు నమోదు

మఠంపల్లి: మండల కేంద్రంలోని జాన్‌పహాడ్‌–మట్టపల్లి ప్రధాన రహదారి కూడలిలో శనివారం స్థానిక యువకుడు బైక్‌పై స్టంట్‌లు నిర్వహించాడు. తన మేన మామకు చెందిన బైక్‌పై అత్యంత ప్రమాదకరంగా స్టంట్‌లు చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేశాడు. జనం, వాహనాలతో రద్దీగా ఉండే మెయిన్‌ సెంటర్‌లో బైక్‌పై విన్యాసాలు చేయడంతో స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. బైక్‌ అదుపుతప్పితే అతడితో పాటు రోడ్డుపై వెళ్తున్న ఇతర ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడేది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ అక్కడికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బైక్‌తో సహా అతడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. యువకుడిని చాకచక్యంగా పట్టుకున్న ఎస్‌ఐను సీఐ చరమందరాజు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement