మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డుకు చెందిన చిన్నారులు చిత్రలేఖనంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటూ పతకాలు, ప్రశంసా పత్రాలు సాధిస్తూ తమదైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమావత్ సైదానాయక్, వైద్యురాలు ఝాన్సీలక్ష్మీబాయి దంపతుల కుమార్తెలు రమావత్ రిత్విక (6వ తరగతి), రమావత్ హితాంశి (2వ తరగతి) చిన్నతనం నుంచే బొమ్మలు వేయడంలో ఎంతో ఆసక్తి కనబరిచారు. పిల్లల ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు.. చదువుతో పాటు ఖాళీ సమయాల్లో విజయ్ డ్రాయింగ్ క్లాసెస్ నిర్వాహకులు ఇనుగుర్తి విజయ్‌కుమార్ వద్ద రెండేళ్లుగా వారికి శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రకృతి, కాలుష్యం, సాంప్రదాయ వనితలు, బాల కార్మికులు, మొక్కల పెంపకం తదితర సామాజిక అంశాలపై ఈ అక్కాచెల్లెళ్లు ఇప్పటికే 50కి పైగా అద్భుతమైన చిత్రాలు గీసి పలువురి ప్రశంసలు అందుకున్నారు.
ఫ ఆరో తరగతి చదువుతున్న రమావత్ రిత్విక కలర్ పెన్సిల్ వర్క్, వాటర్ కలర్స్‌తో చిత్రాలు వేయడంలో దిట్ట. 2024లో డ్రీమ్ ఆర్ట్స్ అకాడమీ (విజయవాడ) నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో సిల్వర్ మెడల్, 2024లో ఆమీర్ ఆర్ట్స్ అకాడమీ (నెల్లూరు) పోటీల్లో మెరిట్ సర్టిఫికెట్, 2024–25 సంవత్సరంలో క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ (గుంటూరు) నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతి సాధించింది. అదేవిధంగా 2025లో మారుతీ ఆర్ట్స్ అకాడమీ (గుజరాత్) నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించింది.
ఫ రెండో తరగతి చదువుతున్న హితాంశి కూడా చిత్రలేఖనంలో అక్కకు తగ్గ చెల్లిగా రాణిస్తోంది. ముఖ్యంగా కలర్ పెన్సిల్ షేడింగ్ చేయడంలో ప్రత్యేకతను చాటుకుంటోంది. 2025లో ముంబైకి చెందిన ‘రంగోత్సవ్ సెలబ్రేషన్స్’ వారు నిర్వహించిన జాతీయ స్థాయి కలర్ కాంపిటేషన్‌లో మెరిట్ సాధించింది. 2025లో క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ (గుంటూరు) వారు నిర్వహించిన పోటీల్లోనూ మెరిట్ సాధించి సత్తా చాటింది.
ఫ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో
పతకాల పంట
ఫ సామాజిక అంశాలపై
50కి పైగా అద్భుత పెయింటింగ్స్


