బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి

Sep 6 2026 2:25 AM | Updated on Sep 6 2026 2:25 AM

నాగార్జునసాగర్‌ : బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన 565వ నంబర్‌ జాతీయ రహదారిపై నాగార్జునసాగర్‌లోని నెల్లికల్లు గ్రామ స్టేజీ సమీపంలో శనివారం జరిగింది. విజయపురిటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జునసాగర్‌లోని పైలాన్‌ కాలనీకి చెందిన బత్తుల సైదులు(45) బైక్‌పై వెళ్తుండగా.. నెల్లికల్లు గ్రామ స్టేజీ సమీపంలోకి రాగానే హైదరాబాద్‌ నుంచి ఆంధ్రా వైపు వెళ్తున్న కారు డ్రైవర్‌ సాగర్‌ ఎదురుగా వస్తున్న సైదులు బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సైదులుకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సైదులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విజయపురిటౌన్‌ ఎస్‌ఐ సతీష్‌ తెలిపారు.

బోనాల పండుగలో

ఇరువర్గాల మధ్య ఘర్షణ

తిప్పర్తి : మండలంలోని గంగన్నపాలెం గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గురువారం రాత్రి జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిప్పర్తి ఎస్‌ఐ ఇరుగు రవి తెలిపిన వివరాల ప్రకారం.. గంగన్నపాలెం గ్రామానికి చెందిన మర్రి నరేష్‌పై 2025 సెప్టెంబర్‌లో వినాయక చవితి సందర్భంగా అదే గ్రామానికి చెందిన గంటేకంపు మధు, మేకల శివాజీ దాడి చేశారు. ఆ ఘటనపై అప్పట్లో మర్రి నరేష్‌ తిప్పర్తి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పాత కక్షలను మనసులో పెట్టుకున్న వారు.. గురువారం గ్రామంలో జరిగిన బోనాల పండుగ సందర్భంగా రాత్రి సమయంలో మళ్లీ గొడవకు దిగారు. గంటేకంపు మధు, మేకల శివాజీ, కొండేటి ప్రసాద్‌, కొండేటి ప్రవీణ్‌ కలిసి ప్రత్యర్థి వర్గానికి చెందిన కొండేటి సతీష్‌, కొండేటి శ్రీకాంత్‌, మర్రి నరేష్‌పై దాడి చేసి కత్తులతో కడుపులో పొడిచారు. ఈ ఘటనలో సతీష్‌, శ్రీకాంత్‌, నరేష్‌కు తీవ్ర గాయాలు కాగా.. వారిని చికిత్స నిమిత్తం నల్లగొండలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఒకరైన కొండేటి సతీష్‌ తమ్ముడు కొండేటి మహేందర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఇరుగు రవి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement