యాదగిరిగుట్ట : దేశంలోని కార్మికుల హక్కులను కాపాడుకోవడానికి, కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించే చలో పార్లమెంట్‌ను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు, కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. యాదగిరిగుట్టలో శనివారం నిర్వహించిన సీఐటీయూ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో వారు పాల్గొని మాట్లాడారు. దేశంలోని కార్మిక చట్టాలు, హక్కులు, సంక్షేమ పథకాలను బలహీనపర్చే విధానాలను కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కంటే కార్పొరేట్ సంస్థలకు మరింత స్వేచ్ఛ కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని దుయ్యబట్టారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు దేశంలో కోట్లాది మంది కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ప్లాట్‌పాంలపై పనిచేసే కార్మికులకు స్థిరమైన వేతనం, ఉద్యోగ భద్రత, పింఛన్, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా లేవన్నారు. గిగ్, ప్లాట్‌ఫాం కార్మికులను కార్మికులుగా గుర్తించి, వాటికి చట్టబద్ధమైన హక్కులు, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సీఐటీయూ అనుబంధ యూనియన్లు, జిల్లా కమిటీలు, పారిశ్రామిక ప్రాంతాలు, రవాణా రంగం, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు, అసంఘటిత రంగాలు, గిగ్, ప్లాట్‌ఫాం కార్మికులు సంఘటితంగా పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య, జె. మల్లికార్జున్, భూపాల్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ వీరారెడ్డి, రమ, శ్రీకాంత్, జె. వెంకటేష్, వీఎస్ రావు, వంగూరి రాములు, ఈశ్వర్‌రావు, కూరపాటి రమేష్, కళ్యాణం వెంకటేశ్వర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం, నాయకులు దాసరి పాండు, ఎండీ పాషా, గొరిగె సోములు, సుబ్బూరు సత్యనారాయణ, ఎస్‌కే షరీఫ్, సీహెచ్. రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు


