ఆరు గ్యారంటీలు అమలుకు నోచుకోలేదు | - | Sakshi
Sakshi News home page

ఆరు గ్యారంటీలు అమలుకు నోచుకోలేదు

Sep 6 2026 2:25 AM | Updated on Sep 6 2026 2:25 AM

నార్కట్‌పల్లి : ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలుకు నోచుకోలేదని, దీంతో ప్రజలు కాంగ్రెస్‌ పాలనపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్‌ నియోజకవర్గంలో శనివారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించిన నేపథ్యంలో చిరుమర్తి లింగయ్యను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. తాను శుభకార్యాలకు వెళ్లాలని చెప్పినా వినకుండా ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు అరెస్టు చేశారని ఆయన పోలీసులతో కాసేపు వాగ్వాదానికి దిగారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పోలీసులు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హౌస్‌ అరెస్టు చేశారని మండిపడ్డారు. నకిరేకల్‌ నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన 100 పడకల ఆస్పత్రి 2022లో కేసీఆర్‌ హయాంలోనే మంజూరైందన్నారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా.. ఏడాదిలోపే దాదాపు 80 శాతం పనులను పూర్తి చేశామన్నారు. అనంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగా.. మిగిలిన 20 శాతం పనులు పూర్తిచేయడానికి మూడేళ్లు పట్టిందంటే నకిరేకల్‌ నియోజకవర్గ అబివృద్ధిపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో ప్రజలే అర్థం చేసుకుంటున్నారని విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో యానాల అశోక్‌రెడ్డి, దూదిమెట్ల సత్తయ్య, చిరుమర్తి యాదయ్య, దుబ్బాక శ్రీధర్‌, మేక వెంకట్‌రెడ్డి, నరేష్‌, వాజిద్‌, మహేష్‌, వెంకట్‌, బొబ్బల శివశంకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

ఫ నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే

చిరుమర్తి లింగయ్య

ఫ నోటీసులివ్వకుండా హౌస్‌ అరెస్ట్‌ చేశారని మండిపాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement