ప్రీ ప్రైమరీ నియామకాలకు రాజకీయ అడ్డంకి? | - | Sakshi
Sakshi News home page

ప్రీ ప్రైమరీ నియామకాలకు రాజకీయ అడ్డంకి?

Aug 22 2026 1:35 AM | Updated on Aug 22 2026 1:35 AM

ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల

మెరిట్‌ జాబితా విడుదల

నియామక ఉత్తర్వులు సైతం ఇచ్చినా.. అంతలోనే నిలిపివేత!

చదువు చెప్పేవారు

లేక నష్టపోతున్న చిన్నారులు

నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా ప్రారంభించిన ప్రీప్రైమరీ సెక్షన్లకు ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకం నిలిచిపోయింది. జిల్లాలో ఈ విద్యా సంవత్సరం 124 ప్రభుత్వ పాఠశాలలను ప్రీ ప్రైమరీ సెక్షన్ల కోసం విద్యాశాఖ ఎంపిక చేసింది. ఈ 124 పాఠశాలలకు ప్రత్యేకంగా ఇన్‌స్ట్రక్టర్‌, ఆయాలను నియమించేందుకు జూన్‌ 21న నోటిఫికేషన్‌ జారీ చేసి.. అర్హతల ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టింది. మెరిట్‌ జాబితా విడుదల చేసి.. ఆగస్టు 1న ఎంపికై న వారికి ఉత్తర్వులు ఇచ్చి సంబంధిత పాఠశాలల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు. కానీ, అదే రోజు నియామక ప్రక్రియపై అనూహ్యంగా బ్రేక్‌ పడినట్లు తెలుస్తోంది. ఎవరినీ పాఠశాలల్లో చేర్చుకోవద్దు.. ఇప్పటికే చేర్చుకున్నవారిని వెనక్కి పంపండి అంటూ అదో రోజు మధ్యాహ్నం మౌఖికంగా ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.

సవ్యంగానే సాగిన నియామక ప్రక్రియ

ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు నాణ్యమైన ప్రీ ప్రైమరీ విద్య అందించి.. ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలను పెంచడంతోపాటు వాటిని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రీ ప్రైమరీ విద్యను దశలవారీగా ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా ప్రీ ప్రైమరీ సెక్షన్లలో బోధన కోసం ఇన్‌స్ట్రక్టర్లు, చిన్నారుల సంరక్షణకు ఆయాలను నియమించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. 124 పాఠశాలలకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేయడంతో ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అర్హతలను పరిశీలించిన జిల్లా విద్యాశాఖ అధికారులు మెరిట్‌ జాబితాను రూపొందించి వెబ్‌సైట్‌లో ఉంచారు. అనంతరం ఆగస్టు 1న మెరిట్‌ ప్రాతిపదికన ఉత్తర్వులు జారీ చేసి.. ఎంపికై న అభ్యర్థులు సంబంధిత పాఠశాలల్లో చేరాలని సూచించారు. ఇంతవరకు ప్రక్రియ నిబంధనల ప్రకారమే సాగినట్లు తెలుస్తోంది.

రాజకీయ ఒత్తిళ్లే కారణమా?

నియామక ప్రక్రియ నిలిచిపోవడానికి రాజకీయ ఒత్తిళ్లే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నకిరేకల్‌, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు తమకు సమాచారం లేకుండా తమ నియోజకవర్గ పరిధిలో నియామకాలు ఎలా చేపడతారంటూ జిల్లా విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.ఈ అంశంపై విద్యాశాఖ నుంచి స్పష్టమైన వివరణ వెలువడలేదు.

కొన్నిచోట్ల విధుల్లో ఉన్నా..

సంతకాలు లేవు..

జిల్లాలోని పలు ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఎలాంటి వివాదం లేని ప్రాంతాల్లో కొందరు ఎంపికై న ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలు పాఠశాలలకు వెళ్లి విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే వారికి అధి కారికంగా హాజరు నమోదు చేసుకునేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో విధులు నిర్వహిస్తున్నా.. సంతకాలు మాత్రం చేయడం లేదని తెలుస్తోంది.

ఉపాధ్యాయులపై భారం

ప్రీ ప్రైమరీలో చేరిన చిన్నారులకు ప్రత్యేకంగా బోధించాల్సిన సిబ్బంది లేకపోవడం, ఉన్న ఉపాధ్యాయులపై అదనపు భారం పడుతోంది. నియామకాలపై స్పష్టత లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లోకూడా సందేహాలు కలుగుతున్నాయి. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే.. ఈ సందిగ్ధతకు వీలైనంత త్వరగా తెరదించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement