ఫ కలెక్టర్ చంద్రశేఖర్
ఫ లోక్యాతండాలో ఇంటింటికీ
తిరిగి సమస్యలపై ఆరా
త్రిపురారం : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు గ్రామాలు, తాండాల్లో ప్రజలందరికీ అందించడమే లక్ష్యంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. త్రిపురారం మండలంలోని లోక్యాతండా గ్రామస్తులు ఇటీవల గ్రామాభివృద్ధి కోసం ఢిల్లీలోని ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో ఎస్టీ కమిషన్ ఆదేశానుసారం కలెక్టర్ శుక్రవారం అన్ని శాఖల అదికారులతో కలిసి లోక్యాతండాలో గ్రామంలో గడపగడపకు తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో గుడిసెను గమణించిన కలెక్టర్ పూరి గుడిసెలోకి వెళ్లి తల్లి కూతురులతో మాట్లాడారు. గుడిసెల్లో ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. విద్యార్థులతో ముచ్చటించారు. కొత్తగా నిరించిన ఇందిరమ్మ ఇంట్లోకి వెళ్లి బిల్లులు సకాలంలో ఆందాయా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులతో పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం వల్ల తగిన స్థాయిలో వర్షాలు కురవలేదని, జలాశయాల్లో సాగు నీటి నిల్వలు లేనందున రైతులు ఉన్న నీటి వనరులతో వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలన్నారు. గ్రామాల అభివృద్ధికి ఎస్టీ వర్గాల సమస్యలు పరిష్కరించడానికి అవసరమైన నిధులు కేటాయించామని, అర్హులైన ప్రతి ఒక్కరికి పంక్షేమ పథకాలు అందేవిధంగా చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. వీఓ బిల్డింగ్ నిర్మాణానికి అవసరమైన స్థలం కోసం సర్వే నిర్వహించి భూమి కేటాయించాలని ఆర్‌డీఓను ఆదేశించారు. ఈసందర్భంగా తండా వాసులు మిషన్ భగీరథ నీరు రావడం లేదని, నల్లాలు సక్రమంగా లేవని, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, కల్టెక్టర్‌కు విన్నవించారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి కాంతారావు, ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ గాజుల ప్రమీల, ఎంపీడీఓ విజయకుమారి, విద్యుత్ ఏఈ బాలునాయక్, పీఆర్‌ఏఈ సతీష్, వైద్యాధికారి వనజ, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


