సీనియర్లకు తగిన గుర్తింపు లేదు | - | Sakshi
Sakshi News home page

సీనియర్లకు తగిన గుర్తింపు లేదు

Aug 18 2026 7:46 AM | Updated on Aug 18 2026 7:46 AM

సాక్షి, యాదాద్రి : ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీల(పీఏసీ) సమావేశాలు సోమవారం భువనగిరిలో జరిగాయి. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ హాజరయ్యారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో సర్‌పై అప్రమత్తంగా ఉండడం, పార్టీ సంస్థాగత బలోపేతం, రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో పాటు మూడు జిల్లాల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు బీర్ల ఐలయ్య, గుడిపాటి నర్సయ్య, పున్న కై లాష్‌, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.

సీనియర్లకేదీ ప్రాధాన్యత

పీఏసీ సమావేశంలో పలువురు నాయకులు తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు మీనాక్షినటరాజన్‌కు వివరించారు. ఇక్కడి సీనియర్‌ నాయకులకు, సుదీర్ఘకాలం సేవలందించిన వారికి ప్రభుత్వంలో, నామినేటెడ్‌ పోస్టులలోనూ తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా పదవులు ఇంకా భర్తీ చేయడం లేదని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. నామినేటేడ్‌ పదవుల కోసం జిల్లాల నుంచి ఇప్పటికే జాబితాలను అధిష్టానానికి పంపించామని, వారికి అవకాశం ఇవ్వాలని మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కోరారు.

మున్సిపల్‌ పాలకవర్గాల్లో గ్రూపులు

కొన్ని మున్సిపాలిటీల పాలకవర్గాల్లో చైర్మన్లకు, కౌన్సిలర్లకు మధ్య సహకారం కొరవడిందనే అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. మోత్కూరుతో పాటు పలు ప్రాంతాల్లో కౌన్సిలర్లు చైర్మన్‌ తీరుపై అసంతృప్తిగా ఉన్నారని అధిష్టానం దృష్టికి తీసుకుపోయారు. నియోజకవర్గంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల పురోగతిని, ప్రజల నుంచి వస్తున్న స్పందనను సమీక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని స్పష్టం చేశారు.

పనిచేయకుంటే తప్పించాలి..

ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయికి చేరాలని, ప్రజాభిప్రాయం తీసుకోవడంలో లోపాలు ఉన్నాయని, సోషల్‌ మీడియా టీమ్‌లను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో చర్చకు వచ్చింది. పార్టీ పదవుల్లో ఉంటూ పనిచేయని వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని కూడా పలువురు అధిష్టానం దృష్టికి తెచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం మంచిదే అయినప్పటికీ, కండక్టర్లు, డ్రైవర్లు మహిళా ప్రయాణికులతో ప్రవర్తిస్తున్న తీరు ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఉందని కొందరు నాయకులు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం (టిఫిన్‌) వంటి కార్యక్రమాలు ప్రజలకు ఇంకా సరిగ్గా చేరలేదని, దీనిపై విస్త్రత ప్రచారం సాగాలన్నారు.

పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి

– మీనాక్షి, నటరాజన్‌

రాష్ట్రంలో ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్‌ శ్రేణులంతా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీకి, ప్రజాప్రతినిధులకు మధ్య మెరుగైన సమన్వయం ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పార్టీకి ఆయువుపట్టుగా ఉన్న దక్షిణ తెలంగాణాలోని నల్లగొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలపై బీజేపీ పార్టీ దృష్టిసారించిందని, దీనిపై కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పీఏసీ సమావేశాల్లో వ్యక్తమైన అభిప్రాయాలపై సానుకూలంగా స్పందించిన నేతలు, ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంటామని, పార్టీ కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ తగిన న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. సర్‌ రెండవ విడతలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా ఎన్‌రోల్‌ చేయించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు.

నామినేటెడ్‌ పదవుల్లో

ప్రాధాన్యం కల్పించాలి

మున్సిపాలిటీల్లో వర్గపోరుతో తలనొప్పులు

సమావేశంలో నాయకుల చర్చ

పార్టీ బలోపేతంపై దృష్టిసారించాలన్న మీనాక్షి నటరాజన్‌

బీజేపీతో జాగ్రత్త అవసరమని సూచన

భువనగిరిలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ పీఏసీల సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement