నల్లగొండ : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించి, ప్రజలకు నమ్మకం కలిగేలా అధికారులు బాధ్యతతో, చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మండల స్థాయిలో ప్రజావాణి ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా అధికారులు కూడా మండల ప్రజావాణికి హాజరై ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు. సోమవారం జిల్లా స్థాయి ప్రజావాణికి మొత్తం 146 దరఖాస్తులు రాగా, రెవెన్యూ శాఖకు 82, ఇతర శాఖలకు 64 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్వో దశరథ, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్‌రెడ్డి, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణితో ప్రజలకు ప్రయోజనం
మండలస్థాయిలోనూ ప్రజావాణి నిర్వహిస్తుండడంతో ప్రజలకు ప్రయోజనం చేకూర్చనుంది. కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజావాణి జరుగుతుండగా, మండలాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణికి అధికారులు ట్యాబ్ లింకింగ్ ద్వారా అనుసంధానం అవుతున్నారు. కలెక్టరేట్‌కు వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను కలెక్టర్ నేరుగా మండల స్థాయి అధికారులతో ట్యాబ్ లింకింగ్ కాన్ఫరెన్స్‌లో చర్చించి, అక్కడి నుంచే తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో మండల స్థాయిలోనే సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్
ఐదుగురికి షోకాజ్ నోటీసులు
నల్లగొండ : మండలస్థాయి ప్రజావాణికి గైర్హాజరైన అధికారులపై కలెక్టర్ బి.చంద్రశేఖర్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరాలని ఆదేశించారు. సోమవారం జిల్లాలోని 33 మండలాల్లో నిర్వహించిన మండలస్థాయి ప్రజావాణికి మొత్తం 759 మంది అధికారులు హాజరు కావాల్సి ఉండగా 754 మంది హాజరయ్యారు. ఐదుగురు గైర్హాజరయ్యారు. ప్రజల నుంచి మొత్తం 190 ఫిర్యాదులు స్వీకరించారు. కట్టంగూర్‌లో ఒకరు, నిడమనూరులో ముగ్గురు, త్రిపురారంలో ఒకరు విధులకు గైర్హాజరయ్యారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరారు.


