వృద్ధుల ఆశలపై నీళ్లు! | - | Sakshi
Sakshi News home page

వృద్ధుల ఆశలపై నీళ్లు!

Aug 17 2026 1:53 AM | Updated on Aug 17 2026 1:53 AM

అనుమతి ఉన్నవే స్వీకరిస్తున్నాం

నేరుగా దరఖాస్తు చేసుకున్న వృద్ధులు..

నల్లగొండ టూటౌన్‌ : ‘ఒక ఇంట్లో ఒకే పింఛన్‌ ఎందుకు.. మేము అధికారంలోకి వస్తే రెండు పింఛన్లు ఇస్తాం’ అని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండున్నరేళ్ల వరకు ఊరించి ఉసూరుమనిపించింది. చేయూత పథకంలో ఇచ్చే పింఛన్లలో వృద్ధులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేయిచ్చింది. ఇప్పట్లో వృద్ధాప్య పింఛన్లు ఇచ్చే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది. ఇటీవల కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభించింది. ఈనెల 31 వరకు కొత్తగా దరఖాస్తులు స్వీకరించడానికి గడువు విధించింది. దివ్యాంగులు, వితంతు, ఒంటరి మహిళలు, తలసేమియా, డయాసిస్‌ తదితర వాటి కోసం కొత్త దరఖాస్తు నమూనాను కూడా విడుదల చేసింది. కానీ వృద్ధాప్య పింఛన్‌ దరఖాస్తులు మాత్రం స్వీకరించడం లేదు.

58 ఏళ్లు నిండిన వారికే ఇస్తామని ప్రకటనలు

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 58 సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పించన్లు ఇస్తామని చెప్పింది. అప్పట్లో కూడా వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా కొత్త పించన్లు మాత్రం ఇవ్వలేదు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఇస్తున్న పింఛన్‌ మొత్తం రూ.4 వేల వరకు పెంచుతామని కాంగ్రెస్‌ నేతలు హామీనిచ్చిన విషయం తెలిసిందే. అర్హులైన వారు ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికీ ఇస్తామని చెప్పింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా ఇప్పటి వరకు కొత్తగా పింఛన్లు ఇవ్వలేదు. ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది.. కానీ, ఓఏపీ (ఓల్డ్‌ ఏజ్‌ పింఛన్‌) సైట్‌ మాత్రం ఓపెన్‌ చేయలేదు. దాంతో గత ప్రభుత్వం హయాం నుంచి ఎదురుచూస్తున్న వృద్ధుల ఆశలపై ప్రస్తుత ప్రభుత్వం నీళ్లు చల్లిందనే విమర్శలు వస్తున్నాయి.

ప్రభుత్వం అనుమతి ఇచ్చిన పింఛన్లకే అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ఇప్పటి వరకు 1600 మంది దరఖాస్తులు ఆన్‌లైన్‌ చేశాం. వృద్ధాప్య పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించడానికి ప్రభుత్వం నుంచి అనుమతి లేదు. అనుమతి వచ్చిన తరువాత వృద్ధుల దరఖాస్తులు స్వీకరిస్తాం.

– శేఖర్‌రెడ్డి, డీఆర్‌డీఓ

ఫ వృద్ధాప్య పింఛన్‌పై ఊరించి ఉసూరుమనిపించిన ప్రభుత్వం

ఫ ఓఏపీ మినహా మిగతా వాటికి దరఖాస్తుల స్వీకరణ

ఫ ప్రభుత్వ కార్యాలయాల్లో మూలుగుతున్న వేల అప్లికేషన్లు

ఫ అమలుకు నోచుకోని ఎన్నికల హామీ

వృద్ధాప్య పింఛన్ల కోసం జిల్లా వ్యాప్తంగా మండలాల్లో ఎంపీడీఓ కార్యాలయం, పట్టణాల్లో మున్సిపల్‌ కార్యాలయాలు, కార్పొరేషన్‌లో ఐదేళ్ల నుంచి చాలామంది నేరుగా దరఖాస్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా 25 వేల నుంచి 30 వేల వరకు దరఖాస్తులు ఉన్నట్లు అంచనా. ప్రభుత్వం సైట్‌ ఓపెన్‌ చేయకపోవడంతో ఆ దరఖాస్తులన్నీ ఆయా కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. వాటన్నింటిని పరిగణనలోకి తీసుకోని సర్కార్‌ మరో కొత్త నమూనా దరఖాస్తు తయారు చేసి దాంట్లో అసలు వృద్ధాప్య అనే పదం చేర్చలేదు. వృద్ధాప్య పింఛన్లకు ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో అధికార యంత్రాంగం వాటిని మినహాయించి మిగతా వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. కాగా ఇప్పటి వరకు వచ్చిన 1600 మంది దరఖాస్తులను అధికారులు ఆన్‌లైన్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement