రైతులు కొత్తగా వరిసాగు చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

రైతులు కొత్తగా వరిసాగు చేయొద్దు

Aug 17 2026 1:53 AM | Updated on Aug 17 2026 1:53 AM

నల్లగొండ టౌన్‌ : నాగార్జునసాగర్‌పై ఆధారపడి కొత్తగా వరి నాట్లు వేయవద్దని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ఆల్దాస్‌ జానయ్య అన్నారు. ఆదివారం నల్లగొండలో వ్యవసాయ రంగంపై ఎల్‌నినో ప్రభావం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై రైతు సంఘం నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో సంభవించే నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు, వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టడం శుభపరిణామమన్నారు. రాష్ట్రంలో అవసరానికి మించి ధాన్యం ఉత్పత్తి జరుగుతోందని, వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. బోర్ల సంఖ్య పెరగడంతో భూగర్భ జలాల వినియోగం కూడా అధికమైందన్నారు. ఈ ఏడాది వర్షాలు తగ్గడంతో రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గిపోయాయని, భవిష్యత్‌లో భూగర్భ జలాలు కూడా మరింత తగ్గే అవకాశం ఉందన్నారు. వరి సాగుకు అధికంగా నీరు, రసాయన ఎరువులు అవసరమవుతాయని, వరి విస్తీర్ణాన్ని తగ్గించడం ద్వారా నీటి వనరులను కాపాడుకోవచ్చన్నారు. నాలుగు ఎకరాల్లో వరి సాగు చేసే రైతు కనీసం రెండు ఎకరాల్లో పప్పు దినుసులు, నూనెగింజలు లేదా ఇతర మెట్ట పంటలు సాగు చేయాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు పంటల మార్పిడిపై దృష్టి సారించాలని సూచించారు. పంటకు ధర నిర్ణయించే అధికారం రైతుకు లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందన్నారు. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, మార్కెట్‌ ధరలకు అనుగుణంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. నల్లగొండలో తొలిసారిగా నిర్వహిస్తున్న అఖిల భారత రైతు మహాసభను విజయవంతం చేసేందుకు రైతులు, ప్రజా ఉద్యమాల నాయకులు, కార్యకర్తలు అన్ని విధాలుగా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అరిబండి ప్రసాదరావు, నంద్యాల నరసింహారెడ్డి, బొంతల చంద్రారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, కందాల ప్రమీల, బండ శ్రీశైలం పాల్గొన్నారు.

ఫ ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ఆల్దాస్‌ జానయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement