నల్లగొండ టూటౌన్ : నల్లగొండ ఎమ్మెల్యేగా, మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 27 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఎంత? రెండేళ్ల కరోనా కాలం మినహాయించి, తాను కేవలం మూడేళ్లలో చేసిన అభివృద్ధి ఎంత? అనే అంశంపై బహిరంగ చర్చకు రావాలని మంత్రికి.. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో లక్కీ డ్రా ద్వారా అర్హులైన పేదలను ఎంపిక చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారుల ఎంపికలో భారీగా కమిషన్లు దండుకున్నారని, ఒక్కో ఇంటికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు లంచాలు వసూలు చేశారని ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు సుమారు రూ.1,500 కోట్లు తెచ్చి మెడికల్ కాలేజీ, ఐటీ హబ్, ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధితో పాటు అనేక పనులు చేపట్టామన్నారు. బీఆర్‌ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు పెడితే భయపడేది లేదని, కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం మానుకోవాలని హితవు పలికారు. సీపీఎం కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ నాయకులను అరెస్ట్ చేసిన ఎస్‌ఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కటికం సత్తయ్యగౌడ్, అభిమన్యు శ్రీనివాస్, మారగోని గణేశ్, చీర పంకజ్‌యాదవ్, రావుల శ్రీనివాస్‌రెడ్డి, దేప వెంకట్‌రెడ్డి, అయితగోని యాదయ్య, పెరిక యాదయ్య, పేర్ల అశోక్, దొడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి


