మిర్యాలగూడ టౌన్ : ప్రజా సమస్యల పరిష్కారాన్ని ప్రజల ముంగిటికే చేర్చడమే లక్ష్యంగా పాలనను వికేంద్రీకరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాష్ట్ర, జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిలకే పరిమితమైన ప్రజావాణి కార్యక్రమాన్ని ఇకపై మండల స్థాయికి విస్తరిస్తూ ప్రణాళికా శాఖ జీఓ ఎంఎస్ నంబర్ 4ను జారీ చేసింది. మండల స్థాయిలోనే ఫిర్యాదులను స్వీకరించి వేగంగా పరిష్కరించడం ద్వారా ప్రజా సేవలను మరింత బలోపేతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. మండల కేంద్రంలోనే వినతులను స్వీకరిస్తుండటంతో ప్రజలకు దూరబారంతో పాటు సమయం, ఖర్చులు కూడా తగ్గుతున్నాయి.
నోడల్ అధికారిగా ఎంపీడీఓ
నూతన మార్గదర్శకాల ప్రకారం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మండల ప్రజావాణికి ఎంపీడీఓ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు.
అన్ని శాఖల అధికారుల హాజరు తప్పనిసరి
ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసం వివిధ శాఖల అధికారులు ఒకేచోట అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎంపీడీఓ, తహసీల్దార్, మండల పంచాయతీ అధికారి, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య, విద్యాశాఖ, అటవీశాఖ, రోడ్లు భవనాలు, నీటిపారుదల, అధికారులతో పాటు పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్, విద్యుత్ శాఖ, మున్సిపల్ కమిషనర్, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై ఫిర్యాదులను స్వీకరించాలి.
పోర్టల్‌లో నమోదు..
మండల ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. దీనికోసం కంప్యూటర్, స్కానర్, ఇంటర్నెట్ సదుపాయంతో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి, అర్జీదారునికి గ్రీవెన్స్ ఐడీతో కూడిన రసీదును వెంటనే అందజేస్తారు. దీనిద్వారా బాధితులు తమ దరఖాస్తు స్థితిని ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది.
దివ్యాంగులు, మహిళలకు ప్రాధాన్యం
ప్రజావాణి కేంద్రాల వద్ద తాగునీరు, సీటింగ్, నీడ, హెల్త్ డెస్క్, వీల్ చైర్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, గర్భిణులు, పసిపిల్లలతో వచ్చే వారికి ఫిర్యాదులు సమర్పించడంలో మొదటి ప్రాధాన్యమిస్తారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుండటంతో, చిన్న చిన్న సమస్యల కోసం జిల్లా కేంద్రాల చుట్టూ తిరిగే తిప్పలు సామాన్య ప్రజలకు తప్పనున్నాయి.
ఫ నేటి నుంచి ప్రతి సోమవారం
ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహణ
ఫ అన్ని శాఖల మండల అధికారుల హాజరు తప్పనిసరి
ఫ ప్రజావాణి పోర్టల్‌లో దరఖాస్తుల నమోదు


