డిండి : మండల కేంద్రంలోని ఇరిగేషన్ శాఖ భూముల్లో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఆదేశాల మేరకు జిల్లా ఉన్నత, స్థానిక అధికారులు గురువారం సర్వే ప్రారంభించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని పలువురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, 2009లో అప్పటి కలెక్టర్ ఆదేశాలతో డిండి గ్రామపంచాయతీ పరిధిలో 950 మంది రైతుల పేర్ల మీద ఉన్న దాదాపు 480 ఎకరాల వ్యవసాయ భూమి ఇరిగేషన్ శాఖ పేరిట మార్పు జరిగింది. నాటి నుంచి ఆ భూముల్లో రైతులు వ్యవసాయం చేసుకుంటున్నా.. భూములపై క్రయవిక్రయాల హక్కులు లేకపోవడంతో పాటు, ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం అందడం లేదు. దాదాపు పదిహేనేళ్లుగా భూములపై హక్కు కోల్పోయిన రైతులు.. తిరిగి తమకు పట్టాలిప్పించాలని ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఎట్టకేలకు తాజాగా సర్వే ప్రక్రియ ప్రారంభం కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


