నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ బేగ్ పదవీకాలం ఏడాది పాటు పొడిగిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బేగ్ 2027 జూలై 16వ తేదీ వరకు విధుల్లో కొనసాగనున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును
అమలు చేయాలి
మునుగోడు : పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన జీపు జాతాను గురువారం మునుగోడులో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురిజ రామచంద్రం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బొల్గూరి నర్సింహ, మండల కార్యదర్శి చాపల శ్రీను, తిరిపారి వెంకటేశ్వర్లు, బి.లాలు, గోసుకొండ లింగయ్య, ఈదులకంటి కై లాష్ గౌడ్, గట్టుపల్లి నర్సిరెడ్డి, ముత్తయ్య పాల్గొన్నారు.
కేంద్రమంత్రి రాజీనామా అన్ని వర్గాల విజయం
చండూరు : కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశంలోని ప్రజాస్వామ్య శక్తుల విజయమని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. గురువారం చండూరులో జరిగిన ఆ పార్టీ నియోజకవర్గస్థాయి విస్త్రృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో మృతి చెందిన 22 మంది విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో తీవ్రవాదులు ఉన్నారని అమిత్ షా అనడం ఆయన అవివేకానికి నిదర్శనం అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, నాయకులు కర్నాటి మల్లేశం, చాపల మారయ్య, ఏర్పుల యాదయ్య, సాగర్ల మల్లేష్, జెర్రిపోతుల ధనుంజయ, ముత్తులింగం, కర్నాటి సుధాకర్, లింగయ్య, లింగస్వామి, శ్రీను, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
మూసీకి 2,183 క్యూసెక్కుల వరద
కేతేపల్లి : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. గురువారం ఎగువ నుంచి మూసీకి 2,183 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. ఈ సీజన్‌లో మూసీ ప్రాజెక్టుకు రెండువేల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో రావటం ఇదే మొదటి సారి. ప్రాజెక్టులో గరిష్ట స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా గురువారం సాయంత్రానికి 638.90 అడుగులకు చేరుకుంది. మూసీ ఆయకట్టులో వానాకాలం పంటల సాగు కోసం కుడి కాల్వకు 328 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 306 క్యూసెక్కుల చొప్పున మొత్తం 634 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. లీకేజీ, సీపేజీ, ఆవిరి రూపంలో 40 క్యూసెక్కుల నీరు వృథా అవుతుంది. మూసీ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.92 టీఎంసీల నీరు నిల్వ ఉందని మూసీ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.


