నల్లగొండ : తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్, ప్రజా యుద్ధనౌక గద్దర్ పేర్లు ప్రపంచం ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచి ఉంటాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, ప్రజా యుద్ధనౌక గద్దర్ వర్ధంతిని అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి.. వారి చిత్రపటాలకు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి చివరి శ్వాస వరకు తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లో నింపి వారి ఆకాంక్షను సాకారం చేయడంలో జయశంకర్ కీలక పాత్ర పోషించారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పనిచేశారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించి ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని బలంగా వినిపించారన్నారు. తెలంగాణలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినప్పుడే జయశంకర్ ఆశయాలు నెరవేరినట్లవుతాయన్నారు. ప్రజా యుద్ధ నౌక, గాయకుడు గద్దర్ తెలంగాణ ఉద్యమానికి తన పాటల ద్వారా ఊపిరిపోశారని కొనియాడారు.
సొరంగం పూర్తయితే డెడ్‌స్టోరేజీ నుంచీ నీరు
ఎస్‌ఎల్‌బీసీ సొరంగ పనులు 2028 నాటికి పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా బ్రాహ్మణవెల్లెంల వరకు సాగునీరు రప్పించి నల్లగొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు నీరందిస్తామన్నారు. కరువు పరిస్థితిలో కూడా శ్రీశైలం డెడ్‌స్టోరేజీ నుంచి ఎస్‌ఎల్‌బీసీ ద్వారా నీరందేలా ప్రాజెక్టును రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్‌అలీ పాల్గొన్నారు.
తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన వ్యక్తి జయశంకర్
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా జీవితాంతం పోరాడిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం నల్లగొండ కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయంలో వేర్వేరుగా ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ ఎన్.శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్‌ఓ దశరథ్, సమాచార శాఖ సహాయ సంచాలకుడు యు.వెంకటేశ్వర్లు, కలెక్టర్ కార్యాలయ ఏఓ మోతీలాల్, అదనపు ఎస్పీ రమేష్, ఏఓ శివప్రసాద్, ఎస్‌బీ డీఎస్పీ మల్లారెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు, ఆర్‌ఐలు, మినిస్టీరియల్ సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


