ఫ నగరంలో భారీగా పెరిగిన వ్యాపార సముదాయాలు
ఫ రికార్డుల్లో మాత్రం తక్కువ సంఖ్యలో ట్రేడ్ లైసెన్స్‌లు
ఫ వివరాల సేకరణలో వార్డు ఆఫీసర్లు
నల్లగొండ టూటౌన్ : నీలగిరి నగరంలో ఇటీవల కాలంలో కార్పొరేట్ మాల్స్, కాలనీల్లో వాణిజ్య వ్యాపార దుకాణాలు, హాస్పిటల్స్ భారీగా పెరిగినాయి. హైదరాబాద్ నగరం నుంచి కార్పొరేట్ మాల్స్ నీలగిరి నగరానికి భారీగా తరలిరావడంతో ప్రధాన రహదారుల వెంట సాధారణ వ్యాపార దుకాణాలు కాలనీల్లోకి మార్చారు. మాల్స్, హాస్పిటల్స్ భారీగా వెలియడంతో కిరాయి భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దాంతో అంత కిరాయి చెల్లించలేని స్థానిక వ్యాపారులు కాలనీల్లోకి దుకాణాలను మార్చుకొని వ్యాపారం చేస్తున్నారు. దాంతో నీలగిరి నగరంలో వాణిజ్య వ్యాపార దుకాణాలు భారీగానే పెరిగినట్లు తెలుస్తున్నా రికార్డుల్లో మాత్రం తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. ఇటీవల కొత్తగా వచ్చిన కార్పొరేషన్ కమిషనర్ ట్రేడ్ లైసెన్స్‌పై నజర్ పెట్టడంతో లెక్కల్లో తక్కువ ఉన్నట్లు తేలింది. దాంతో ట్రేడ్ లైసెన్స్‌పై పక్కా వివరాలు సేకరించాలని నిర్ణయించారు.
డివిజన్ల వారీగా వివరాల సేకరణ
నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 48 డివిజన్లు ఉన్నాయి. వాటి పరిధిలోని వాణిజ్య సముదాయాలు, కార్పొరేట్ మాల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, దుకాణాలు, కాలనీల్లో ఉన్న వాణిజ్య వ్యాపార దుకాణాలు తదితర వాటి వివరాలను వార్డు ఆఫీసర్ల ద్వారా సేకరిస్తున్నారు. వారం రోజుల పాటు అన్ని డివిజన్లలో వ్యాపార దుకాణాలను తనిఖీ చేసి ట్రేడ్ లైసెన్స్ వివరాలు కూడా తీసుకుంటారు. డివిజన్‌లో ఎన్ని వాణిజ్య వ్యాపార దుకాణాలు ఉన్నాయి, ఎన్ని దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్‌లు ఉన్నాయి, ఉంటే ఎలాంటి వ్యాపారం, దానికి ట్రేడ్ రుసుం ఎంత వేశారనే వివరాలను వార్డు ఆఫీసర్లు సేకరించనున్నారు. ప్రస్తుతం 2,600 వరకు ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నట్లు వివరాలు ఉన్నాయి. డివిజన్ల వారీగా లెక్కలు తీస్తున్నందున వాణిజ్య వ్యాపార దుకాణాలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలో వాణిజ్య దుకాణాల సంఖ్య ఎక్కువగా పెరిగితే మున్సిపల్ కార్పొరేషన్‌కు ఆదాయం కూడా భారీగా సమకూరనుంది.
నగరంలో వాణిజ్య దుకా ణాల వివరాలు సేకరించా లని నిర్ణయించాం. ట్రేడ్ లైసెన్స్ దుకాణాలను గుర్తించడానికి డివిజన్ల వారీగా వివరాలు సేకరిస్తున్నాం. ట్రేడ్ లైసెన్స్ లేనివి గుర్తించి లైసెన్స్ జారీ చేస్తాం. ప్రతి వ్యాపారి కచ్చితంగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి.
– వంశీకృష్ణ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్


