డిండి : మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. పలు గ్రామాల్లో అంగన్‌వాడీ భవనాలు శిథిలావస్థకు చేరాయి. కొన్ని గ్రామాల్లో అరకొర వసతుల మధ్య అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. డిండి మండలంలో మొత్తం 73 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో 32 కేంద్రాలు సొంత భవనాల్లో.. 14 కేంద్రాలు అద్దెలో, మరో 27 కేంద్రాలు ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన భవనాల్లో నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు మొత్తం 1,303 మంది పౌష్టికాహారం పొందుతున్నారు. అయితే అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. డిండిలోని ఎంఆర్‌సీ భవనం సమీపంలో అంగన్‌వాడీ భవనం పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లు అయినా పూర్తి కాలేదు. సింగరాజుపల్లిలో మూడేళ్లుగా అసంపూర్తిగానే ఉంది. శిథిల భవనాల్లో నడిచే కేంద్రాల్లో సిబ్బంది భయం భయంగా గడుపుతున్నారు.


